icon icon icon
icon icon icon

ప్రశ్నించే గొంతుకలపై పైశాచికత్వం!

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా రాష్ట్రంలో జగన్‌ రాజ్యాంగం అమలవుతూనే ఉంది. ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, చెప్పినట్లు వినకపోతే దాడులు, ఎదురు తిరిగితే అక్రమ కేసులు.. ఇలా వైకాపా నేతలు పేట్రేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలనే కాదు..

Published : 09 May 2024 07:37 IST

నిలదీస్తున్న ప్రజలపై వైకాపా నేతల దాడులు
వారు చెప్పిందే వినాలి.. అడిగితే అంతే..!

ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా రాష్ట్రంలో జగన్‌ రాజ్యాంగం అమలవుతూనే ఉంది. ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, చెప్పినట్లు వినకపోతే దాడులు, ఎదురు తిరిగితే అక్రమ కేసులు.. ఇలా వైకాపా నేతలు పేట్రేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలనే కాదు.. ప్రజలపైనా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైకాపా నేతల గూండాయిజాన్ని అడ్డుకోవాల్సిన కొందరు పోలీసులు వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు.  ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో జగన్‌ ప్రభుత్వం గత ఐదేళ్లలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గ్రామాల్లో పాడైన రహదారులకు మరమ్మతులు లేవు. కొత్త రోడ్ల నిర్మాణం లేదు. గోతులమయమైన రోడ్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) నిధులు దాదాపు రూ.4 వేల కోట్లతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రహదారుల పనులను వైకాపా సర్కారు పూర్తి చేయడంలో విఫలమైంది. గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత నీరు అందించేందుకు రూ.26,700 కోట్ల అంచనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో మొదలైన జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులకూ రాష్ట్ర వాటా ఇవ్వకుండా జగన్‌ ప్రభుత్వం పాడుబెట్టింది. తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన చంద్రన్న కాంతి పథకానికి పేరు మార్చి, కార్యక్రమం అమలులో అనేక మార్పులు, చేర్పులు చేసి చివరకు గ్రామాల్లో వీధి దీపాలు వెలగకుండా చేసిందీ.. జగన్‌ ప్రభుత్వం. ఇలా అనేక సమస్యలతో ఐదేళ్లుగా అవస్థలు పడిన ప్రజలు ఎన్నికల వేళ గ్రామాలకు వస్తున్న వైకాపా నేతలను నిలదీస్తున్నారు. ఇది తట్టుకోలేక వారు ప్రజలపైనే దాడులకు దిగుతున్నారు.

ఇంతకంటే అరాచకం ఇంకేమైనా ఉంటుందా?

  • అన్నమయ్య జిల్లా కుటాగులోళ్లపల్లికి చెందిన కళ్యాణి వీధి దీపాలు వెలగడం లేదని గ్రామానికి వచ్చిన తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి సతీమణి కవితమ్మకు చెప్పారు. అదే నేరమైనట్లు వైకాపా నేతలు ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. గర్భవతి అని చూడకుండా కడుపుపై తన్ని కర్కశంగా వ్యవహరించారు. ఆమె భర్తపైనా దాడిచేశారు.
  • రహదారి నిర్మిస్తానన్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హామీ నెరవేరలేదని ప్రచారానికి వచ్చిన నేతలకు బ్రహ్మంగారిమఠం మండలం బాగాతిపల్లెకు చెందిన యువకులు గుర్తుచేశారు. అంతే.. ఆ యువకులను పోలీసులు స్టేషన్‌కి లాక్కుపోయి చుక్కలు చూపించారు.
  • వాలంటీర్లు అంటే బానిసలుగా చూస్తున్న వైకాపా నేతలు.. వారిపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో వార్డు వాలంటీరు నళినిపై వైకాపా కౌన్సిలర్‌ భాగ్యలక్ష్మి, ఆమె అనుచరులు ఇంటికి పిలిపించుకొని మరీ దాడి చేశారు. అప్పటికీ కసితీరక మరోసారి ఇంటికెళ్లి, ఆమె తల్లినీ తీవ్రంగా కొట్టారు.
  • ప్రభుత్వ సర్వేయర్‌ మనోజ్‌ కుమార్‌పై విజయవాడలో వైకాపా మూకలు దాడి చేశాయి. పోస్టల్‌ బ్యాలట్‌కు ఇచ్చిన డబ్బు తిరస్కరించడమే ఆయన చేసిన పాపం.

అల్లరి మూకల రాజ్యం!

వైకాపా అభ్యర్థులు, వారి తరఫున ఆ పార్టీ నేతలు వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార బృందాల్లో అల్లరి మూకలు పాల్గొంటున్నాయి. ప్రత్యేకించి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో ఎక్కువగా ఇలాంటి పరిస్థితి ఉంది. సమస్యలపై నేతలను ప్రజలు నిలదీసినా.., ప్రచారాన్ని అడ్డుకున్నా.. ఈ మూకలు నిద్రలేస్తున్నాయి. ‘ఈ ఐదేళ్లలో ఇళ్ల ముందు మురుగునీరు నిలకుండా కూడా చేయలేకపోయారు’ అని విశాఖలో కొందరు మహిళలు వైకాపా నేతల దృష్టికి తీసుకెళ్తే.. ఆ మూకలు మహిళలపై దౌర్జన్యానికి దిగాయి. ‘అసంపూర్తిగా నిలిచిపోయిన భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ) పనులు పూర్తి చేయకుండా ప్రచారం కోసం ఎలా వచ్చార’ని వైకాపా కార్పొరేటర్లను ప్రశ్నించిన యువకులపై ఇలాంటి మూకలే బెదిరింపులకు దిగాయి. ఒంగోలు నగర శివారు కాలనీల్లో తాగునీటి సమస్యపై ప్రశ్నించిన మహిళలను పార్టీ శ్రేణులు పక్కకు నెట్టేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img