icon icon icon
icon icon icon

ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్‌

బాధితుల్ని ఓదార్చడంలో సీఎం జగన్‌కు ఎవరూ సాటిరారు.. నా అక్క.. నా చెల్లి.. నా అన్న.. అంటూ ఎంతో ఆత్మీయతను పంచుతారు.

Published : 09 May 2024 07:21 IST

అన్నమయ్య ప్రాజెక్టు ఏడాదిలో కడతామంటూ హామీ
రెండున్నరేళ్లుగా తీరని బాధితుల వెతలు
నేడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో సీఎం పర్యటన

ఈనాడు, కడప : బాధితుల్ని ఓదార్చడంలో సీఎం జగన్‌కు ఎవరూ సాటిరారు.. నా అక్క.. నా చెల్లి.. నా అన్న.. అంటూ ఎంతో ఆత్మీయతను పంచుతారు. తలపై చేయి పెట్టి నేనున్నానంటూ భరోసా ఇస్తారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకూ అలాంటి మాటలే చెప్పారు.. కానీ అవేమీ వాళ్ల కడుపు నింపలేకపోయాయి. కన్నీళ్లు తుడవలేకపోయాయి. వరదలు ఊళ్ల మీద పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లి రెండున్నరేళ్లు అయినా బాధితులు కుదురుకోలేదు. మనుపటి జీవితానికి నోచుకోలేదు. కూడు, గూడు కోసం అల్లాడుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి రాజంపేటకు గురువారం ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్‌ వస్తున్నారు.

బాధితులకు జగన్‌ చెప్పిందేంటి? చేసిందేంటి..?

2021 నవంబరు 19న వరదల కారణంగా అన్నమయ్య జలాశయం మట్టి కట్ట కొట్టుకుపోయింది. చెయ్యేరు నది ఒడ్డునున్న రాజంపేట మండలం.. పులపుత్తూరు, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, తోడూరుపేట, రామచంద్రాపురం, పాపరాజుపల్లె, శేషమాంబపురం, రాచపల్లె, గుండ్లూరు గ్రామాల్లో సర్వం ఊడ్చేసి.. గుండెకోత మిగిల్చింది. విపత్తు జరిగిన రెండు వారాలకు అంటే 2021 డిసెంబరు 2న సీఎం జగన్‌.. వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. సర్వం కోల్పోయిన అభాగ్యుల తలపై చేయిపెట్టి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. హామీలతో ఊరడించారు. జగనన్న మాటలు.. చివరకు నీటిమీద రాతలే అయ్యాయి. రెండున్నరేళ్లుగా నిలువనీడ కల్పించలేకపోయారు. జల విలయంతో 453 ఇళ్లు నేల మట్టం కాగా.. 601 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో సామగ్రి, పశువులు ఏమీ మిగల్లేదు. వరదల్లో కొట్టుకుపోయి 39 మంది మృత్యువాత పడ్డారు. ప్రాణాలతో బయటపడ్డ వారు కట్టుబట్టలతో మిగిలారు. బాధితులందరికీ ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఏడాదికి తాళాలిస్తామనే హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం కోసం 30.12 ఎకరాలు సేకరించి 5 చోట్ల లేఅవుట్లు వేశారు. పులపుత్తూరు, తొగూరుపేట, మందపల్లెలోని లేఅవుట్లలో 448 మందికి ఇళ్ల స్థలాలిచ్చారు. కొండ ప్రాంతం నివాసయోగ్యం కాదంటూ 120 మంది బాధితులు పట్టాలు తీసుకోలేదు. ప్రత్యామ్నాయం చూపాలన్న విజ్ఞప్తికి దిక్కూ మొక్కూలేదు. వాటిలో ఇప్పటికి 26 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తికాగా.. మిగిలినవి వివిధ దశల్లో ఆగిపోయాయి. చాలా వరకు పునాదుల దశల్లోనే ఉన్నాయి. దీంతో చాలా మంది గుడారాల్లోనే తలదాచుకుంటున్నారు. నష్టపోయిన బాధితులకు పరిహారం అంతంత మాత్రంగానే ఇచ్చి సరిపెట్టారు.

టెండరుతోనే ఆగిపోయిన పునర్నిర్మాణం

అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి రూ.879 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచి గుత్తేదారును ఖరారు చేశారు. 2023-24 బడ్జెట్‌లో రూ.20 లక్షలు మాత్రమే కేటాయించారు. దీంతో గుత్తేదారు ముందుకు రాలేదు. ఏడాదిలో ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతామన్న జగన్‌ హామీ రెండున్నరేళ్లు అవుతున్నా టెండరు పిలవడం, గుత్తేదారు వెనక్కి తగ్గడం వరకే పరిమితమైంది. ఫలితంగా రాజంపేట, నందలూరు, పుల్లంపేట, పెనగలూరు మండలాలు కరవుతో అలమటిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img