icon icon icon
icon icon icon

ఇళ్ల స్థలాలు చూపిస్తాం రండి

జగనన్న ఇళ్ల పట్టాల స్థలాల్ని చూపిస్తామంటూ లబ్ధిదారుల్ని వైకాపా నాయకులు మభ్యపెట్టబోగా... అది వికటించి అభాసుపాలయ్యారు.

Published : 09 May 2024 07:13 IST

లబ్ధిదారుల్ని మభ్యపెట్టిన వైకాపా నాయకులు

సీతానగరం, న్యూస్‌టుడే: జగనన్న ఇళ్ల పట్టాల స్థలాల్ని చూపిస్తామంటూ లబ్ధిదారుల్ని వైకాపా నాయకులు మభ్యపెట్టబోగా... అది వికటించి అభాసుపాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం సుద్దకొండ వద్ద 2020లో రఘుదేవపురం, నల్గొండ, కూనవరం, సీతానగరం గ్రామాల్లోని 1,800 మంది లబ్ధిదారులకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారు. వారికి ఆ స్థలాల్ని చూపించలేదు. కొద్దిరోజులుగా ప్రచారాలకు వస్తున్న వైకాపా నాయకుల్ని ఈ విషయమై సీతానగరం కాలువగట్టు పక్కన ఉంటున్న లబ్ధిదారులు నిలదీస్తున్నారు. వారి నుంచి వస్తున్న వ్యతిరేకతను కొంతైనా తగ్గించుకునేందుకు... సుద్దకొండ వద్ద లేఔట్‌ వేసి, రోడ్లు అభివృద్ధి చేశారు... ఇళ్లు కట్టేస్తున్నారు, మీ స్థలాల్ని వచ్చి చూసుకోవాలని మాజీ వాలంటీర్ల చేత లబ్ధిదారులకు చెప్పించారు. సుద్దకొండ వద్దకు బుధవారం ఉదయం 200 మందికి పైగా లబ్ధిదారుల్ని వాహనాల్లో తరలించారు. అక్కడికి వెళ్లి చూడగా 2020లో పట్టాలిచ్చినప్పుడు ఎలా ఉందో... అదే పరిస్థితి కనిపించింది. కనీస వసతులైనా లేకపోవడంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. ఈలోపు రఘుదేవపురానికి చెందిన కొంతమంది వచ్చి ‘ఈ స్థలాల్ని మాకిచ్చారు. మా దగ్గర కూడా పట్టాలున్నాయి’ అని చెప్పారు. దీంతో వైకాపా నాయకులకు, ఇరు గ్రామాల వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలిసి పోలీసులు రావడంతో వైకాపా నాయకులు ఒక్కొక్కరుగా జారుకున్నారు. లబ్ధిదారులు నిరాశగా వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img