icon icon icon
icon icon icon

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే.. యావదాస్తి దానమిచ్చినట్లే!

‘2024 సంవత్సరం మే నెల 13న.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు.

Updated : 09 May 2024 17:55 IST

సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశం

‘దాన విక్రయ దస్తావేజు’ రూపంలో వైరల్‌

ఈనాడు, అమరావతి: ‘2024 సంవత్సరం మే నెల 13న.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నాకు అన్ని తెలిసి విజ్ఞతతో తీసుకున్న నిర్ణయం’ అంటూ జగన్‌ ఫొటో వాటర్‌ మార్క్‌గా ఉన్న రూ.100 స్టాంపు కాగితంపై రాసిన సందేశం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ‘దాన విక్రయ దస్తావేజు’ అనే పేరుతో ఉన్న సందేశంలో.. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌, 2022 అని, ఆస్తిని రాసి ఇచ్చే వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, రాయించుకునే వారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఉంది. ‘మీ భూమి- నా హక్కు’ అనే ట్యాగ్‌లైన్‌తో జగన్‌ ఫొటో, మన గుర్తు ఫ్యాన్‌ అని కూడా ఉంది. వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పత్రాలు చర్చనీయాంశంగా మారాయి.


తాతల నుంచి వచ్చిన ఆస్తులపై మీ పెత్తనమేంటి జగన్‌?

పాటలో ప్రశ్నించిన రచయిత
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

ఈనాడు, అమరావతి: ‘ఈ భూమి మనది రా.. హక్కుదారు మనం రా’ అని 1.45 నిమిషాల నిడివితో ఉన్న ఓ పాట సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది. తెలంగాణలోని రజాకార్ల ఉద్యమానికి వ్యతిరేకంగా పుట్టిన ‘దొర ఏందిరో.. వాడి పీకుడేందిరో’ గీతం స్ఫూర్తితో రూపొందించిన ఈ పాట ఇప్పుడు రాష్ట్రమంతటా మార్మోగుతోంది. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రజల ఆందోళనలను ప్రస్తావిస్తూ ఈ పాటను రచయిత రూపొందించారు. నాటి బ్రిటిష్‌ పాలనను తలపించేలా జగన్‌ తీసుకొచ్చిన చట్టాన్ని నిలదీస్తూ ‘ఈ భూమి మనది రా.. హక్కుదారు మనం రా’ అని, పాసు పుస్తకంపై ప్రభుత్వ లోగో చిన్నదిగా.. జగన్‌ ఫొటో ప్రముఖంగా కనిపించేలా చేయడాన్ని నిలదీస్తూ ‘నడుమ జగన్‌ పెత్తనం ఏందిరో’ అని ప్రశ్నించారు. తాతలు, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపై పెత్తనాన్ని అధికారుల చేతుల్లోకి తీసుకెళ్లడంపై ‘అధికారులేందిరో.. సెటిల్‌మెంట్లు ఏందిరో? కోర్టులుండగా.. మీ తీర్పులేందిరో’ అని వైకాపా ప్రభుత్వాన్ని గద్దించినట్టుగా ఈ పాట సాగింది.


పోస్టల్‌ బ్యాలట్‌పై జిల్లా కలెక్టర్లు, ఆర్వోలకే స్పష్టత లేదు

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌పై ఇప్పటికీ చాలా మంది కలెక్టర్లు, ఆర్వోలకు స్పష్టత లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ ప్రక్రియలో నెలకొన్న అయోమయం కారణంగా ఉద్యోగులు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇక్కడ, అక్కడ అంటూ వారిని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించిన అధికారులకు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటేసే అవకాశం కల్పించకుండా వాయిదాలు వేస్తున్నారని పేర్కొన్నారు. ‘మన రాష్ట్రానికి సంబంధించిన వెయ్యి మంది పోలీసులు మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తున్నారు. వారికి 13వ తేదీన ఓటేసే అవకాశం కల్పించాలి. లేని పక్షంలో వారికి పోస్టల్‌ బ్యాలట్‌ ఇవ్వాలి. వీరుకాక చాలా మంది మన పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వీరినీ పరిగణనలోకి తీసుకోవాలి. దీనిపై డీజీపీ స్పందించాలి. పోలీసు నోడల్‌ అధికారులెవరో తెలియని గందరగోళం నెలకొంది. ఈసీని అడుగుతుంటే స్పష్టత లేదు. వెంటనే పోలీసు నోడల్‌ అధికారులు ఎవరన్నది తెలియజేయాలి’ అని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. జగన్‌ పాలనలో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారికి సక్రమంగా జీతభత్యాలనూ ఇవ్వడం లేదని వర్ల పేర్కొన్నారు.


అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు

ఇదీ వైకాపా నేతల తీరు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పుండాలి’.. ఇదీ సమస్యలు పరిష్కరించండంటూ వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి గతంలో అధికార గర్వంతో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. సమస్యలకు పరిష్కారం కావాలంటే కాళ్లు పట్టుకోవాలి. చేతులు పట్టుకోవాలంటూ ఐదేళ్లుగా సతాయించిన వైకాపా నాయకులు.. పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగుల కాళ్లు పట్టుకుని మరీ ఓట్లేయమని బతిమలాడుతున్నారు. కుప్పంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకోవాడానికి వచ్చిన ఉద్యోగుల కాళ్లు పట్టుకుంటున్న వైకాపా నాయకుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో పలువురు ఉద్యోగులు వీటిని వాట్సప్‌ గ్రూపుల్లో వ్యాప్తిచేస్తూ వైకాపా నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


దుష్టుల వల్ల దూరమయ్యాం.. మళ్లీ జన్మలో కలుసుకుందాం

కుమార్తెను ఉద్దేశించి ముద్రగడ

కిర్లంపూడి, న్యూస్‌టుడే: దుష్టుల వల్ల దూరమయ్యామని.. మళ్లీ జన్మలో కలుసుకుందామని.. తన కుమార్తె క్రాంతిని ఉద్దేశించి వైకాపా నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. తుని సభలో ముద్రగడ పద్మనాభంకు కుమార్తె ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పారని.. ఆమెను తన నుంచి దూరం చేయడానికి కుట్ర కుతంత్రాలతో చేసిన పని అదని ఆరోపించారు. ‘మీరు 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని చెప్పి చిన్న చిన్న నటులతో ఎందుకు ప్రచారం చేయించుకుంటున్నారు?’ అని ముద్రగడ ప్రశ్నించారు. కిర్లంపూడిలో బుధవారం ఆయన మాట్లాడారు.


‘లబ్ధిదారులకు రూ.18 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్‌’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వివిధ పథకాలకు సంబంధించిన ఉత్తుత్తి బటన్లు నొక్కిన సీఎం జగన్‌.. రూ.18 వేల కోట్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ఈ పథకాలకు సంబంధించిన నిధుల్ని చంద్రబాబు అడ్డుకున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img