icon icon icon
icon icon icon

పల్నాడులో నాటుబాంబుల కలకలం

కొద్దిరోజుల్లో పోలింగ్‌ జరగనున్న వేళ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నాటుబాంబులు బయటపడటం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. దుర్గి మండలంలోని జంగమహేశ్వరపాడులో నాటుబాంబులతో పాటు, మారణాయుధాలు ఉన్నాయనే సమాచారం మేరకు ఎస్సై ఎస్‌.కోటయ్య సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు.

Published : 09 May 2024 07:11 IST

జంగమహేశ్వరపాడులో స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఈనాడు డిజిటల్‌ - నరసరావుపేట, దుర్గి - న్యూస్‌టుడే: కొద్దిరోజుల్లో పోలింగ్‌ జరగనున్న వేళ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నాటుబాంబులు బయటపడటం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. దుర్గి మండలంలోని జంగమహేశ్వరపాడులో నాటుబాంబులతో పాటు, మారణాయుధాలు ఉన్నాయనే సమాచారం మేరకు ఎస్సై ఎస్‌.కోటయ్య సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి నుంచి ఆరు కత్తులు, ఒక గొడ్డలి, పది ఇనుప రాడ్లు, 17 నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని తెదేపా సానుభూతిపరుడు నాగరాజు ఇల్లుగా గుర్తించారు. ఆ ఇంటి నిర్మాణాన్ని అయిదేళ్ల క్రితం మొదలుపెట్టి మధ్యలోనే నిలిపివేశారు. నాగరాజు ప్రస్తుతం గ్రామంలో ఉండటం లేదు. ఊరునుంచి వెళ్లిపోయిన తెదేపా సానుభూతిపరులు కూడా ఐదేళ్ల తర్వాత మూడు రోజుల క్రితమే గ్రామంలో అడుగుపెట్టారు. ఎక్కడికక్కడ పోలీసు పికెటింగ్‌ ఉన్నప్పటికీ ఇంట్లోకి నాటుబాంబులు ఎలా వచ్చాయనేది అంతు చిక్కడం లేదు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని గురజాల డీఎస్పీ పళ్లంరాజు వెల్లడించారు.

2019లో ఏం జరిగింది?

2019 ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపా వర్గాల దాడులు పెరిగిపోవడంతో తెదేపాను అభిమానించే 60 కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాయి. వారం క్రితం హైకోర్టు ఆదేశాలతో పోలీసులు గ్రామాన్ని వదలి వెళ్లిన కొందరిని తీసుకొచ్చారు. అందులో నాగరాజు కూడా ఒకరు. ‘నేను మూడు రోజుల క్రితమే ఊరికి వచ్చాను. ఇప్పటి వరకు ఆ ఇంట్లోకే వెళ్లలేదు. అక్రమంగా కేసుల్లో ఇరికించేందుకే ఇలా నాటుబాంబుల పథకం వేశారు’ అని నాగరాజు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img