Craters : ఉల్కపాతంతో భారత్‌లో ఏర్పడ్డ మూడు బిలాలివే!

ఉల్కపాతం (meteorite) కారణంగా భారత్‌లో (India) మూడు చోట్ల బిలాలు ఏర్పడ్డాయి. వాటి విశేషాలు తెలుసుకోండి.

Published : 18 May 2023 12:27 IST

కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూ గ్రహం (Earth) పుట్టుక మొదలైంది. మానవ జాతి మనుగడ మొదలైనప్పటి నుంచి కూడా ఈ గ్రహంపైకి అంతరిక్షం (Space) నుంచి రకరకాల శకలాలు వచ్చి పడ్డాయి. అందులో కొన్ని చాలా చిన్నగా ఉండేవి. మరికొన్ని పరిమాణంలో చాలా పెద్దగా ఉండటం వల్ల భూగోళాన్ని ప్రభావితం చేశాయి. సాధారణంగా గ్రహ శకలాలు భూమి దిశగా పయనిస్తున్న క్రమంలోనే కాలిబూడిదైపోతాయి. అతి తక్కువ మాత్రమే విజయవంతంగా భూమిని చేరుతాయి. అలా చేరిన వాటిలో సుమారు 190 దాకా భూమిపై పడి ఒక మచ్చలా ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉల్కపాతం మూలంగా ఏర్పడిన మచ్చలు మన దేశంలోని భూభాగంపై కూడా మూడు ఉన్నాయి. వాటిని బిలాలు అని పిలుస్తున్నారు. అవి మహారాష్ట్రలోని లోనార్‌, మధ్యప్రదేశ్‌లోని ధాలా, రాజస్థాన్‌లోని రామ్‌గఢ్‌ బిలాలు. వీటిని ఆస్ట్రోబ్లెమ్స్‌ అని కూడా పిలుస్తున్నారు.

లోనార్‌ బిలం-మహారాష్ట్ర

భారత్‌లోని మూడు బిలాల్లో మహారాష్ట్రలోని లోనార్‌ బిలం చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని 1823లో కనుగొన్నారు. తొలుత దీన్ని అగ్నిపర్వత బిలం అని శాస్త్రవేత్తలు భావించారు. తరువాత కాలంలో అనేక పరిశోధనలు చేసి ఇది ఉల్కపాతం వల్ల ఏర్పడిందని నిర్థారించారు. ఈ లోనార్‌ బిలం 35000-50000 ఏళ్ల క్రితం ఏర్పడి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బిలం ఓ సరస్సులా దర్శనమిస్తోంది. అది 1.8 కిలోమీటర్ల వ్యాసంతో సుమారు 500 అడుగుల లోతు ఉంది. బిలం అంచు భూమి నుంచి 65 అడుగుల ఎత్తులో కన్పిస్తుంది. మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ బరువైన ఉల్కపాతం వల్ల ఈ గొయ్యి ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ఉల్కపాతం గంటకు 90 వేల కిలోమీటర్ల వేగంతో వచ్చి భూమిని ఢీకొట్టి ఉంటుందని అంచనా. ఈ లోనార్‌ బిలం మరో విశేషం ఏమిటంటే ఇందులోని నీరు ఉప్పగా, క్షార స్వభావం కలిగి ఉంటుంది. ఇది భూమిని చేరి వేల ఏళ్లు పూర్తవుతున్నా ఇందులో మాస్కెలినైట్‌ వంటి శకలాలు ఇప్పటికీ కన్పిస్తున్నాయని చెబుతున్నారు. అధిక వేగంతో భూమిని చేరిన సందర్భంలో మాత్రమే గాజు తరహాలో ఉండే మాస్కెలినైట్‌ ఏర్పడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ పదార్థం లభించడం మూలంగానే లోనార్‌ అగ్నిపర్వత విస్ఫోటంతో ఏర్పడలేదనే నిర్థారణకు వచ్చారు.

ధాలా బిలం-మధ్యప్రదేశ్‌

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం శివపురి జిల్లాలోని ధాలా బిలం వయసు సుమారు అనేక మిలియన్‌ సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. ఇది భారత్‌లోని అతి పురాతన, పెద్ద బిలం. ధాలా బిలం వ్యాసం 11 కిలోమీటర్లు ఉంటుంది. దాంతో ఇది ఆసియాలోనే అతి పెద్ద బిలంగా గుర్తింపు పొందింది. లోనార్‌ లాగే అధిక వేడికి గురైన కారణంగా ఇక్కడ కూడా కొన్ని వికృతమైన శిలలు ఏర్పడ్డాయి. బిలం, దాని అంచు భాగాలు ప్రస్తుతం కోతకు గురయ్యాయి. కానీ, దాని భౌగోళిక నిర్మాణం మాత్రం చెక్కుచెదర్లేదు.

రామ్‌గఢ్‌ బిలం-రాజస్థాన్‌

ఇటీవలి కాలంలో ఈ బిలం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. రామ్‌గఢ్‌ బిలం సుమారు 165 మిలియన్‌ ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని కోట పట్టణం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో రామ్‌గఢ్‌ బిలం ఉంది. దీని వ్యాసం సుమారు 10 కిలోమీటర్లు. రామ్‌గఢ్‌ బిలం మధ్యలో ఒక శిఖరం ఉండటం మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం రూ.57.22 కోట్లు కేటాయించింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని