Charles Bronson : అతడో కరుడుగట్టిన ఖైదీ.. అయినా మూడు పెళ్లిళ్లు!

తోటి నేరస్థులు, జైలు అధికారులపై దాడికి పాల్పడిన కారణంగా ఓ ఖైదీ 50ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు.

Updated : 09 Mar 2023 11:03 IST

బ్రిటన్‌లో కరుడుగట్టిన ఖైదీగా ముద్రపడిన ఛార్లెస్‌ బ్రాన్సన్‌ ఇప్పటికి దాదాపు 50 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తన సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని పెరోల్ ఇవ్వాలని ప్రస్తుతం న్యాయమూర్తులను అభ్యర్థిస్తున్నాడు.

ఎవరీ ఛార్లెస్‌ బ్రాన్సన్‌?

ఛార్లెస్‌ బ్రాన్సన్ అసలు పేరు మైకేల్ గార్డన్‌ పీటర్సన్‌. ఐరా, జో పీటర్సన్‌ దంపతులకు 1952లో ఛార్లీ జన్మించాడు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం(Political background) కూడా ఉంది. ఛార్లీ అత్త, మామ అబెరిస్ట్విత్‌ పట్టణ మేయర్లుగా పనిచేశారు. అదే పట్టణంలో ఛార్లీ తండ్రి కన్జర్వేటివ్‌ క్లబ్‌ను నడిపించేవాడు. బాల్యంలో ఛార్లెస్‌ ఎంతో వినయంగా ఉంటూ.. మంచి పిల్లాడిలా మెలిగేవాడని అతని అత్త ఓ సందర్భంలో మీడియాతో అన్నారు. ఛార్లీ నాలుగేళ్ల ప్రాయం నుంచి లూటన్‌(Luton)లోనే నివాసం ఉన్నారు. అతడు టీనేజ్‌లోకి అడుగుపెట్టగానే ఛెషైర్‌కు మారిపోయారు. దాంతో ఛార్లీ జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. క్రమంగా నేర ప్రపంచం వైపు అడుగులు వేశాడు.

దోపిడీలు.. దొంగతనాలు

యువకుడిగా ఉన్న ఛార్లీకి తన వద్ద తుపాకీ(Gun) ఉండాలనే కోరిక కలిగింది. 1974లో తొలిసారి ఆయుధాల దొంగతనానికి యత్నించి దొరికిపోయాడు. దాంతో అతడిని లివర్‌పూల్లోని హెచ్‌ఎం జైలుకు తరలించారు. ఆ కేసులో ఛార్లీకి ఏడేళ్ల జైలు శిక్ష(jail term) పడింది. కానీ, జైల్లో ఉండగా అధికారులు, తోటి ఖైదీల(prisoners)పై దాడికి పాల్పడ్డాడు. ఈ పరిణామంతో శిక్ష పొడిగించారు. అలా 1987లో జైలు నుంచి విడుదల అయ్యాడు. ఓ నగల దుకాణం(Jewellery shop)లో దొంగతనం చేయడంతో 1988లో మళ్లీ జైలుకు వెళ్లక తప్పలేదు. 1992లో మళ్లీ జైలు నుంచి బయటికొచ్చాడు. ఆ తరువాత మరోసారి దొంగతనం చేయడంతో కటకటాల పాలయ్యాడు. కస్టడీలో ఉండగా విధ్వంసం చేసినందుకు అతడి శిక్ష పొడిగిస్తూ వచ్చారు. 1997లో బ్రాన్సన్‌ డిప్యూటీ ప్రిజన్‌ గవర్నర్‌పై దాడి చేశాడు. సిబ్బంది, తోటి ఖైదీలను కూడా గాయపరచడంతో 5ఏళ్ల జైలు శిక్ష పడింది. జైలులో ఖైదీలకు ఆర్ట్స్‌ క్లాసులు బోధించడానికి వచ్చిన ఓ టీచర్‌ను(teacher) బ్రాన్సన్‌ బంధించాడు. తరువాత ఆ టీచర్‌ను విడిచిపెట్టాడు. దాంతో 2003 వరకు జైలు శిక్ష పొడిగింపు జరిగింది. ఛార్లీ తోటి ఖైదీలను గాయపరుస్తాడన్న ముద్ర పడటంతో అతడిని ఒంటరిగా జైలు గదుల్లో ఉంచేవారు. 2014లోనూ మరోసారి ప్రిజన్‌ గవర్నర్‌పై దాడి చేయడంతో మరో మూడేళ్ల జైలుశిక్ష పడింది.

పిచ్చి ముదిరిందని ఆస్పత్రికి..

జైల్లో వరుసగా దాడులు చేస్తుండటంతో ఛార్లెస్‌ను పలు జైళ్లకు తిప్పారు. అతడి మానసిక పరిస్థితి కూడా బాగాలేదని గమనించి 1978లో బ్రాడ్మోర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో ఉండటం కూడా ఛార్లెస్‌కు నచ్చలేదు. అక్కడ కూడా పలువురిని గాయపరిచాడు. ఓ ఖైదీని చంపే ప్రయత్నం కూడా చేశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఏమైందో తెలియదు.. ఉన్నట్లుండి ఛార్లెస్‌ నిరాహార దీక్ష(Hunger strike)కు దిగాడు. 18 రోజులపాటు దీక్ష కొనసాగించడంతో అతడి ఆరోగ్యం క్షీణించింది. దాంతో పార్క్‌లేన్‌ హాస్పటల్‌కు తరలించారు.

అక్రమ బాక్సింగ్‌ పోటీల్లో..

సుదీర్ఘ జైలు జీవితం గడిపిన ఛార్లెస్‌ కొద్ది రోజులు మాత్రమే బయట ఉన్నాడు. అయినా తాను బేర్‌-నకిల్ బాక్సింగ్‌(boxing) నేర్చుకున్నాడు. అక్రమంగా నిర్వహించే పలు బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు. అప్పుడే తాను మైకేల్ పీటర్సన్‌ పేరును ఛార్లెస్‌ బ్రాన్సన్‌గా మార్చుకున్నాడు. బ్రాన్సన్‌పై ఓ సినిమా(Film) కూడా తీశారు. టామ్‌హార్డీ కథానాయకుడిగా బ్రాన్సన్‌ జీవితాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రానికి బ్రిటిష్‌ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.

జైలు జీవితం గడిపిన సమయంలో ఛార్లెస్‌ పలు బొమ్మలు గీశాడు. వాటితో కొందరు బయటి వ్యక్తులు తాజాగా ఓ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌(art exhibition)ను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఛార్లెస్‌కు పెరోల్‌ రావడానికి సహకరిస్తుందని వారు భావిస్తున్నారు. ఛార్లెస్‌ డ్రాయింగ్‌లు ఎక్కువగా అతడి జైలు జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కేవలం బొమ్మలు వేయడమే కాకుండా పుస్తకాలు కూడా రాశాడు. అవి ప్రచురితమయ్యాయి.

ముచ్చటగా మూడు పెళ్లిళ్లు

ఇంత నేర చరిత్ర ఉన్న ఛార్లెస్‌కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 1971లో బ్రాన్సన్‌.. ఐరీన్‌ కెల్సీని తొలిసారి కలిశాడు. ఎనిమిది నెలలు గడిచిన తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొడుకు పుట్టడంతో ఆ చిన్నారికి మైకేల్‌ జొనాథన్‌ పీటర్‌గా నామకరణం చేశారు. అయితే ఐదేళ్ల తరువాత విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.

మళ్లీ 2001లో ఛార్లెస్‌.. ఫాతిమా సైరా రెహ్మాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి హెచ్‌ఎంపీ వుడ్‌హిల్‌ ప్రిజన్‌లో జరిగింది. వార్తాపత్రికలో బ్రాన్స్‌న్‌ గురించి చదివిన తరువాత ఆమె అతడిని ప్రేమించింది. ఈ పెళ్లి తరువాత ఛార్లెస్‌ తన పేరును ఛార్లెస్‌ అలీ అహ్మద్‌గా మార్చుకున్నాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. నాలుగేళ్ల తరువాత ఈ ఇద్దరూ విడిపోయారు. అనంతరం పేరు మార్చుకున్నాడు.

బ్రాన్సన్‌ ముచ్చటగా మూడోపెళ్లి ఓ నటిని చేసుకున్నాడు. ఆమె పేరు పౌలా విలియమ్సన్‌. 2016, 17 సంవత్సరాల్లో వీరిద్దరూ జైల్లో కలుసుకున్నారు. బ్రాన్సన్‌ ఆమెకు ప్రపోజ్‌ చేయడంతో  అంగీకరించడంతో పెళ్లిచేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాడు. బ్రాన్సన్‌ జైలు నుంచి తప్పకుండా విడుదల అవుతాడని పౌలా నమ్మేది. అనూహ్యంగా ఆమె 2019లో చనిపోయింది. అయితే ఆమె మరణం అనుమానాస్పదంగా లేదని అప్పట్లో పోలీసులు తెలిపారు.

స్వేచ్ఛ కోసం పోరాటం

బ్రాన్సన్‌ తనను విడుదల చేయాలంటూ అనేక సార్లు పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అతని గత హింసాత్మక ప్రవృత్తి కారణంగా న్యాయమూర్తులు అనుకూలంగా తీర్పు ఇవ్వడం లేదు. తాజాగా సోమవారం బ్రాన్సన్‌ తరఫున వాదించిన న్యాయవాది అతడిని విడుదల చేయాలని కోరాడు. దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. 

తన విడుదల విషయంపై అతను మీడియాతో మాట్లాడుతూ ‘నాకు పూర్తి స్వేచ్ఛ కావాలి. నేను ఎవరినీ చంపలేదు. ఎవరిపైనా అత్యాచారం చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు జైల్లో ఉన్నానో చెబితే ప్రజలు నమ్మరు. వారు నన్నొక సీరియల్‌ కిల్లర్‌ అనుకుంటారని’ ఆవేదన వెలిబుచ్చాడు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని