Updated : 29 Feb 2020 19:08 IST

ఆ రాజు ఇగో వల్లే.. ఫిబ్రవరికి తక్కువ రోజులు

ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి..? 28 రోజులు.. లీపు సంవత్సరం అయితే 29 రోజులు ఉంటాయని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. కానీ, అసలు ఆ నెలలో 28/29 రోజులు ఎందుకు ఉన్నాయని ఎప్పుడైనా అనుమానం కలిగిందా? అయితే దాని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోవాలంటే క్రీస్తు పూర్వం 46వ శతాబ్దానికి వెళ్లాలి. రోమన్‌ క్యాలెండర్‌, జూలియస్‌ క్యాలెండర్‌ విషయంలో ఆనాటి పరిశోధకుడు, విద్యావేత్త శాక్రోబోస్కో సిద్ధాంతం ప్రకారం.. 

పూర్వం రోమన్‌ సామ్రాజ్యంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి జూలియస్‌ సీజర్‌. రాజకీయాల్లో, సైన్యంలో కీలకంగా వ్యవహరించేవాడు. సాహిత్యకారుడు.. చరిత్రకారుడు కూడా. జూలియస్‌ హయాంలోనే రోమన్‌ క్యాలెండర్‌లో సంస్కరణలు చేసి.. కొత్త క్యాలెండర్‌ను తీసుకొచ్చాడు. రోమన్‌ క్యాలెండర్‌లో జనవరి 30, ఫిబ్రవరి 29, మార్చి 30, ఏప్రిల్‌ 29, మే 30, జూన్‌ 29, జులై 30, ఆగస్టు 29, సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 29, నవంబర్‌ 30, డిసెంబర్‌ 29 రోజులుగా ఉండేవి. అంటే రోమన్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏడాదికి మనకు 354 రోజులే ఉండేవన్నమాట. అయితే జూలియస్‌ సీజర్‌ వాటిలో మార్పులు చేశాడు. ఏడాదికి 11 రోజులను అదనంగా అంటే ప్రతినెలకు ఒక్కో రోజును కలిపాడు. అయితే ఫిబ్రవరిలో 29 రోజులే ఉంచాడు. ఎందుకంటే లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు అదనంగా ఒక రోజు వచ్చి చేరి 30 రోజులు అవుతాయని భావించాడు. అలా జూలియస్‌ క్యాలెండర్‌ తయారైంది.

అయితే జూలియస్‌ సీజర్‌ తర్వాత రోమన్‌ సామ్రాజ్య సింహాసనాన్ని అగస్టస్‌ అధిష్ఠించాడు. ఆయన హయాంలో జూలియస్‌ క్యాలెండర్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూలియస్‌ పేరుతో ఉన్న జులై నెలలో రోజులు 31 ఉండగా.. తన పేరుతో ఉన్న ఆగస్టు నెలలో 30 రోజులే ఉండటం అగస్టస్‌కు మింగుడుపడలేదు. జూలియస్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని భావించిన అగస్టస్‌.. ఫిబ్రవరిలో ఉన్న 29 రోజుల్లో ఒక రోజును తీసేసి ఆగస్టులో కలిపాడు. దీంతో పక్క పక్కన ఉన్న జులై, ఆగస్టు 31 రోజులు ఉన్న నెలలుగా మారిపోయాయి. ఈ క్రమంలో 28 రోజులతో అతి తక్కువ రోజులున్న నెలగా ఫిబ్రవరి మిగిలిపోయింది. ఆ క్యాలెండర్‌నే ఇప్పటికీ మనం వాడుతున్నాం. అయితే శాక్రోబోస్కో సిద్ధాంతం తప్పని చెబుతూ అనేక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. కాని శాక్రోబోస్కో సిద్ధాంతం మాత్రమే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 

ఇదీ చదవండి..

ఫిబ్రవరి 29.. ఆసక్తికర విషయాలు

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని