Updated : 31 Mar 2022 16:06 IST

ఉమెన్స్ డే స్పెషల్: టెక్ వీర నారీమణులు

 

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌‌, ఐబీఎం ఇలా ప్రపంచంలోని ప్రముఖ టెక్‌ కంపెనీల్లో సీఈవోలుగా మన భారతీయులు ఉండటం చూస్తున్నాం. సుందర్‌ పిచాయ్‌, సత్య నాదేళ్ల శంతను నారాయణ్, అరవింద్‌ కృష్ణ ఇలా చాలా మంది భారత సంతతి పురుషులు ఆయా సంస్థల్లో తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అయితే.. వీరికి ఏ మాత్రం తగ్గమంటూ మన భారత మహిళలు కూడా టెక్‌ కంపెనీల్లో అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా టెక్‌ కంపెనీల్లో తమ సత్తా చాటుతున్న కొందరు నారీమణుల గురించి తెలుసుకుందామా..

 

నాయకత్వ సదస్సులకు అధినేత్రి ఆమె

ది నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌(నాస్‌కామ్)‌.. ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ రంగాలతో కలిసి పనిచేసే ఓ సంస్థ. 1988లో ఏర్పడిన ఈ నాస్‌కామ్‌.. టెక్సాలజీపై జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహిస్తుంటుంది. అభివృద్ధి చెందుతున్న కంపెనీలు ఈ సదస్సుల్లో పాల్గొని తమ పరిధిని పెంచుకోవచ్చు.. ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. ఎదుగుతున్న కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడే ఈ సంస్థకు తొలి మహిళా ప్రెసిడెంట్‌గా దెబ్జానీ ఘోష్‌ వ్యవహరిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందిన దెబ్జానీ ఘోశ్‌.. ముంబయిలో ఎంబీఏ చేశారు. నాస్‌కామ్‌ ప్రెసిడెంట్‌గా టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలపై అవగాహన పెంచుతున్నారు. జీవన స్థితిగతులు, జీవనోపాధిని పెంచడంలో టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని దెబ్జానీ నమ్ముతారు. అందుకే ‘థింక్‌ డిజిటల్‌.. థింక్‌ ఇండియా’కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతే కాదు.. ఇన్‌టెల్‌ ఇండియా, మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎంఏఐటీ)ని ముందుండి నడిపిస్తున్నారు.


గొప్ప పదవులు.. గొప్ప సేవలు

రోషిణి నాడార్‌ మల్హోత్ర.. ఫోర్బ్స్‌ వందమంది ప్రభావిత మహిళలో 54వ ర్యాంక్‌ పొందిన వ్యక్తి. హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌కు సీఈవో.. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌. హెచ్‌సీఎల్‌ టెక్సాలజీస్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ కూడా. కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెనేజ్‌మెంట్‌ నుంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందిన రోషిణి.. హెచ్‌సీఎల్‌లో అడుగుపెట్టక ముందు యూకేలోని స్కై న్యూస్‌లో న్యూస్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. శివ్‌ నాడర్‌ ఫౌండేషన్‌కు ట్రస్టీగా ఉంటూ.. సొంతగా ‘ది హబిటెట్స్‌’ అనే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.
ది హబిటెట్స్‌ ట్రస్ట్‌ ద్వారా రోషిణి ప్రకృతిలోని జీవాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ కార్యక్రమం ద్వారా యువతను ముందు తరం నాయకులుగా తీర్చుదిద్దుతున్నారు. ది వరల్డ్‌ సమ్మిట్‌ ఆన్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌.. రోషిణి కృషికి గుర్తింపుగా ‘ది వరల్డ్స్‌ మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ పీపుల్‌ అవార్డ్‌తో సత్కరించింది. 


ఐటీ రంగంలో ఆమెది పరిచయం అక్కర్లేని పేరు

హెచ్‌సీఎల్‌.. ఐబీఎం.. మైక్రోసాఫ్ట్‌.. హెచ్‌పీ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల్లో 35 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి నీలం ధావన్‌. 11 ఏళ్లపాటు మైక్రోసాఫ్ట్‌ ఇండియాకు ఎండీగా ఉన్నారు. ఆ తర్వాత హెచ్‌పీ ఇండియాలో పని చేశారు. ఐటీ రంగంలో నీలం ధావన్‌ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె నాయకత్వంలోనే హెచ్‌పీ సంస్థ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ‘ఓమెన్‌’ను విడుదల చేసింది. 

దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజ్‌ నుంచి ఎకానమిక్స్‌లో డిగ్రీ, దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన నీలం.. నెదార్లాండ్స్‌కు చెందిన గ్లోబర్‌ సుపర్‌వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ రాయల్‌ ఫిలిప్స్‌లో సభ్యురాలిగా ఉన్నారు. ఆరోగ్య రంగంలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ వినియోగంపై ఆమె కృషి చేస్తున్నారు. ఫోర్బ్స్‌, ఫార్చ్యూన్‌ వంటి మ్యాగజైన్లు నీలంను వ్యాపారరంగంలో శక్తిమంతమైన మహిళగా గుర్తించాయి.


పేపాల్‌లో కీలక విధులు ఆమెవే!

టెక్‌ రంగంలో దీపా మాధవన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు దశాబ్దాలుగా ఆమె ఐటీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు ఎకనామిక్స్‌లో డిగ్రీ.. కంప్యూటర్‌సైన్స్‌లో పీజీ చేసిన దీప.. ప్రస్తుతం ప్రముఖ మొబైల్‌ వాలెట్‌  ‘పేపాల్‌’లో గ్లోబల్‌ డేటా గవర్నెన్స్‌, రెగ్యులేటరి ఆర్గనైజేషన్‌ అండ్‌ డేటా ఫంక్షన్‌ విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దీంతోపాటు పేపాల్‌ డేటా ప్రైవసీలో టెక్నాలజీ సొల్యూషన్‌ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. పేపాల్‌లో చేరకముందు దీపా.. డెలైట్‌, పెన్‌వెల్‌ కార్ప్‌, ఆప్టిమల్‌ టెక్నాలజీస్‌ కంపెనీల్లో పనిచేశారు. 


ఐటీలో మకుటం లేని ‘వనిత’

వనితా నారాయణన్‌కు ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎంతో ఎంతో కాలంగా అనుబంధం ఉంది. ఆ సంస్థలోనే ఆవిడ ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. 2017-18 కాలంలో వనిత ఐబీఎం ఇండియా ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. అంతకుముందు ఐబీఎం ఇండియా ఎండీగా.. ఇండియా, సౌత్‌ ఏషియా రీజినల్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఆమె నాయకత్వంలో ఐబీఎం ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేసింది. 30 ఏళ్ల అనుభవం గల వనిత.. ఇండియాలో ఐబీఎం విస్తరణకు ఎంతగానో కృషి చేశారు.

2012లో వనిత ఐబీఎం ఇండస్ట్రీ అకాడమీలో చేరారు. ఈ అకాడమీని సంస్థ ఆలోచనలను, బ్రాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీ అకాడమీ బోర్డ్‌ సభ్యురాలిగా ఉన్నారు. ఐబీఎం గ్లోబల్‌ వుమెన్స్‌ కౌన్సిల్‌లోనూ ఆమెకు సభ్యత్వం ఉంది. అసోచామ్‌ ఇండియాకు ఛైర్‌పర్సన్‌గానూ వ్యవహరించారు. ప్రస్తుతం సంస్థ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా కొనసాగుతున్నారు.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)ల బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌కు ఛైర్‌పర్సన్‌గా వనితను రాష్ట్రపతి నియమించారు. మూడేళ్లపాటు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. సీఎక్స్‌ఓ టుడే ప్రకటించిన 12 గ్లోబల్‌ ఇండియన్‌ వుమెన్‌ ఆఫ్‌ 2016లో వనితకు చోటు దక్కింది. ఆమెను ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ వుమెన్‌ ఇన్ బిజినెస్‌ ఇన్‌ ఇండియా’గా 2016లో బిజినెస్‌ టుడే మ్యాగజైన్‌ అభివర్ణించింది. మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసిన వనితా నారాయణన్‌ ఆ తర్వాత హ్యూస్టన్‌ యూనివర్సిటీ నుంచి ఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని