Updated : 13 Apr 2020 14:36 IST

ప్రపంచానికి భారత్‌ సంజీవనిగా ఎలా మారింది?

ప్రపంచదేశాలకు భారత్‌ ఇప్పుడొక సంజీవని పర్వతంలా కనిపిస్తోంది. ఎందుకంటారా? ప్రస్తుతం కరోనా(కొవిడ్‌-19)వైరస్‌ సోకిన బాధితులకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌నే ఔషధంగా ఇస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో ఇది అధికంగా లభిస్తుండటంతో చాలా దేశాలు మన సాయం కోరుతున్నాయి. ‘‘చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటాం’’, ‘‘సరైన సమయంలో ఆదుకున్నారు మోదీజీ’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో చేసిన వ్యాఖ్యలు భారత్‌ ప్రతిష్ఠను మరింత పెంచాయి. ఈ రెండు దేశాలే కాదు.. దాదాపు 30దేశాలు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేయాలని భారత్‌ను అభ్యర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ భారత్‌లోనే అత్యధికంగా ఎందుకు తయారవుతోంది? ఇతర దేశాలు ఎందుకు భారత్‌ సాయం అడుగుతున్నాయి? చూద్దాం..

భారత్‌లోనే ఎందుకు అధిక ఉత్పత్తి?

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ అనేది మలేరియా జ్వరాన్ని నయం చేసే ఔషధం. కీళ్ల వాతం, లూపస్‌ వంటి సమస్యలను కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ నయం చేస్తుంది. మన దేశంలో మలేరియా జ్వరాలు తరచూ వస్తుంటాయి. కీళ్లవాతానికి హైడ్రాక్సీక్లోరోక్వినే ఔషధం కావడంతో బాధితులు పెద్దమొత్తంలో వీటిని వాడుతున్నారు. దీన్ని దేశంలో జిడస్‌ కాడిలా అండ్‌ వాలేస్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఐపీసీఎ ల్యాబొరేటరీస్‌ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. భారత్‌ ప్రతి నెలా 60-70 మెట్రిక్‌ టన్నుల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. సాధారణ రోజుల్లో భారత్‌ 3 మిలియన్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ టాబ్లెట్స్‌ వినియోగించుకోగా.. 30 మిలియన్ల టాబ్లెట్స్‌ను ఎగుమతి చేస్తుంటుంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ నుంచే 70శాతం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధం సరఫరా అవుతోందని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలియన్స్‌ చెబుతోంది.  

కరోనాకు హైడ్రాక్సీక్లోరోక్వినే ఎందుకు?

ప్రపంచదేశాలతో పాటు మన దేశానికీ కరోనా వ్యాప్తించింది. దీనిని నయం చేసే వ్యాక్సిన్‌ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కరోనాపై హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సమర్థంగా పనిచేస్తోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. అయితే కరోనా పాజిటివ్‌ ఉన్న రోగులకు మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో ఈ ఔషధాన్ని వాడాలని సూచించింది. ఇది వంద శాతం కరోనాను నయం చేస్తుందనే హామీ లేకపోయినా సమర్థంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఈ ఔషధాన్ని కరోనా కేసుల్లో వినియోగించడం మొదలుపెట్టారు. ఫలితం బాగుండటంతో హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు డిమాండ్‌ పెరిగింది. మన దేశ అవసరాల దృష్ట్యా ఈ ఔషధాన్ని ఇతర దేశాలకు ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం తొలుత నిషేధం విధించింది. అమెరికా విజ్ఞప్తి అనంతరం ఎగుమతులకు అనుమతించింది.

ఇతర దేశాలు మనల్నే ఎందుకు అడుగుతున్నాయి?

చాలా దేశాల్లో మలేరియా జ్వరం అనేది లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మలేరియా లేకపోవడంతో పూర్తిగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. ఇతర దేశాలు, భారత్‌ సరఫరా చేస్తుండటంతో సొంతంగా ఔషధాన్ని తయారు చేసుకోవడం మానేశాయి. కరోనా నేపథ్యంలో ఎగుమతులను భారత్‌ నిషేధించడంతో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరా ఆయా దేశాలకు నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఔషధం పంపాలని కోరగా.. తొలుత నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత సాయం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తాజాగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని అమెరికాకు పంపించింది. అలాగే బ్రెజిల్‌కూ సాయం చేయడంతో ఆ దేశాధ్యక్షుడు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌ సహా పలు దేశాలు ఇప్పుడు భారత్‌ సాయం కోరుతున్నాయి. 

వాళ్లకిస్తే.. మరి మనకు?

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నా.. మన దేశంలో సరిపడా ఔషధ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం దేశానికి కావాల్సిన దానికంటే మూడురెట్లు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఈ నెలలో 3.28 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందులు అవసరమవుతాయని చెప్పింది. ప్రస్తుతం మన దేశీయ అవసరాలు తీర్చుకోగా.. 25కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందులు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం సూచించగా..  కంపెనీలు సైతం దేశీయ అవసరాలకు, ఎగుమతులకు సరిపడా ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని