Flies : ఈగలు మనుషులపై ఎందుకు వాలుతాయి.. ఏం తింటాయంటే!
ఇంటి (House) పరిసరాల్లో కాస్త అపరిశుభ్రత ఉన్నా ఈగలు (Flies) స్వైర విహారం చేస్తుంటాయి. ఆహారం (Food), మనుషులపై (Humans) వాలుతూ చిరాకు తెప్పిస్తుంటాయి. అసలు ఈగల వ్యాప్తికి కారణాలేంటో తెలుసుకోండి.
కొందరి ఇళ్లలో ఈగలు (Flies) నిత్యం మోత మోగిస్తుంటాయి. మధ్యాహ్నం పూట వాటి విజృంభణ మరింత ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారంపై (Food)వాలడమే కాకుండా మన చుట్టూ తిరుగుతూ చిరాకు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా పల్లెటూళ్లలో వ్యవసాయ భూములు, ఎరువు దిబ్బలకు సమీపంలో ఉండే ఇళ్లలో ఈగల సంచారం అధికంగా కన్పిస్తుంది. అసలు ఇళ్లలోకి ఈగలు ఎందుకొస్తాయి? అవి మనుషుల చుట్టూ తిరగడానికి గల కారణం ఏంటి? వాటిని ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకోండి.
వెచ్చదనం కోసం..
మన ఇళ్లలో కనిపించే ఈగలు కేవలం 15 నుంచి 25 రోజులు మాత్రమే జీవిస్తాయి. అవి పగటిపూట ఎక్కువగా సంచరిస్తూ.. నేల, గోడ, సీలింగ్ ఫ్యాన్, కిటికీల వంటి వాటిని ఆవాసంగా చేసుకుంటాయి. కిటీకీల దగ్గర వాటికి కావాల్సినంత వెచ్చదనం లభిస్తుంది. అందుకే ఆ ప్రదేశంలో ఎక్కువ సేపు ఉండటానికి ఇష్టపడతాయి. ఈగలు కూడా నిద్రపోతాయి. అవి నేల, మొక్కలు, కంచె తీగలు, చెత్తడబ్బాలను తమ నిద్ర కోసం ఎంచుకుంటాయి. వాటికి వాతావరణం మరీ చల్లగా ఉన్నా.. మరీ వేడిగా ఉన్నా నచ్చదు. అందుకే ఎప్పుడూ ఒక స్థిరమైన ఉష్ణోగ్రత కోసం పాకులాడుతుంటాయి. అంటార్కిటికాలో మరీ చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ ఈగలు దాదాపుగా కనిపించవు.
వాసన పసిగట్టి..
ఈగలన్నీ మురికిని ఎక్కువగా ఇష్టపడతాయి. చెత్త, మలం, పేడ, కుళ్లిన ఆహారం, కళేబరాలపై వాలి తింటాయి. మనుషుల నివాసాలకు దగ్గర్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టే ఈగలు తరచూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ఈగలకు తీపి పదార్థాలన్నా ఇష్టమే. బెల్లం వంటి పదార్థాల వాసన పసిగట్టి వెంటనే అక్కడ వాలిపోతుంటాయి.
మనుషుల శరీరంపై ఆహారం
మనుషుల చర్మంపై కొంత నూనె, ఉప్పు, మృత కణాలుంటాయి. ఈగలు కేవలం ఇళ్లలో కనిపించే ఆహారం మాత్రమే తినవు. మానవ శరీరంపై ఉండే.. కంటికి కనిపించని వ్యర్థాలు కూడా వాటికి ఆహారమే. అందుకే వాలుతుంటాయి. ఆ సమయంలో మనం చిరాకుతో వాటిని చంపడానికి యత్నించినా సులభంగా తప్పించుకుంటాయి. వాటి తీక్షణమైన కళ్లతో ప్రమాదాన్ని ముందే పసిగట్టి 100 మిల్లీ సెకండ్లలోనే ఎగిరిపోతాయి. ఈగలు ఎక్కడ వాలినా కళ్లతో ఆ పరిసరాలను నిశితంగా గమనిస్తూ ఉంటాయి. మనుషులు తమకు ప్రమాదాన్ని కలుగజేస్తారని అవి భావించవు. ఎందుకంటే వాటి ఆహారమే మనుషులపై ఉంటుంది కాబట్టి.
100కు పైగా వ్యాధులు
వ్యాధులను వ్యాపింపజేయడంలో ఈగల పాత్ర కీలకం. ఒక ఈగ మనం తినే పదార్థాలపై వాలిందంటే దానిలో 100కు పైగా వ్యాధి కారకాలు చేరినట్లే లెక్క. అంతే కాకుండా అవి గుడ్లు పెట్టినా, మల విసర్జన చేసినా వ్యాధులు వ్యాపిస్తాయి. ఈగలు ఏదైనా ఆహారం తింటే దాన్ని మళ్లీ బయటకు రప్పిస్తాయి. ద్రవరూపంలోకి మార్చుకుని తిరిగి కడుపులోనికి పంపించుకుంటాయి. ఆహార పదార్థాలపై లేదా మన శరీరంపై వాలినపుడు కూడా అవి ఇలానే చేసే అవకాశం ఉంది.
ఎలా వదిలించుకోవాలంటే..
- కిచెన్ పరిసరాలను, అందులోని డస్ట్‌బిన్‌ను తరచూ శుభ్రం చేయాలి.
- ఆహార పదార్థాలు, శీతలపానీయాలను ఎల్లప్పుడూ మూసి ఉంచాలి.
- ఎక్కడైనా ఆహారం కింద పడితే వెంటనే శుభ్రం చేసుకోవాలి.
- సింక్‌లో పాత్రలు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి.
- దెబ్బతిన్న పండ్లు, కూరగాయలను ఇంట్లో రోజుల తరబడి ఉంచకుండా పడేయాలి.
- తలుపులు, కిటికీలు మూసినా ఈగలు వస్తున్నాయంటే మరెక్కడైనా రంధ్రాలున్నాయేమో గమనించి వాటిని పూడ్చాలి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు
-
‘ప్రతిపక్ష అభ్యర్థులను పశువుల్లా కొన్నాం’
-
అక్టోబరు 23న విశాఖకు సీఎం జగన్..!
-
వాహన బీమా సంస్థ నుంచి రూ.1.75 కోట్ల పరిహారం
-
‘వాగ్నర్’ కొత్త అధిపతిగా ట్రోషెవ్!
-
New York: వరద గుప్పిట్లో అమెరికా ఆర్థిక రాజధాని.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధింపు!