ఒంటి పూట..కనిపెట్టాలి ఓ కంట!

ఒక్క పూట బడులంటే పిల్లలకు భలే సరదా... చిందులు, సరదాలు.. ఉరకలేసే సమయమిది... ఆనందంతో పాటు జాగ్రత్తలు అవసరం సుమా! వేసవిలో ఒంటి పూట బడులు ఎంత సరదాను తెచ్చిపెడతాయో.. అజాగ్రత్తతో ఉంటే అంతకుమించి రెట్టింపు ప్రమాదాలు జరుగుతాయి.

Updated : 15 Mar 2024 06:23 IST

ఒక్క పూట బడులంటే పిల్లలకు భలే సరదా... చిందులు, సరదాలు.. ఉరకలేసే సమయమిది... ఆనందంతో పాటు జాగ్రత్తలు అవసరం సుమా! వేసవిలో ఒంటి పూట బడులు ఎంత సరదాను తెచ్చిపెడతాయో.. అజాగ్రత్తతో ఉంటే అంతకుమించి రెట్టింపు ప్రమాదాలు జరుగుతాయి.. అలవాట్లు., ఆహారం, ఆరోగ్యం, చదువు.. తదితర అంశాలను ఓ ప్రణాళిక ప్రకారం చేసుకుంటే ప్రయోజనం.. నేటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒంటి పూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనమిది..

న్యూస్‌టుడే, డోర్నకల్‌, భూపాలపల్లి: అప్రమత్తతే కీలకం: ఉదయం ఉరుకులు, పరుగులతో బడికి వెళ్లాలి. మిట్ట మధ్యాహ్నం ఇళ్లకు చేరుకోవాలి. ఇప్పటికే నెత్తిన సూర్యుడు సుర్రుమంటున్నాడు.. సాయంత్రం వేళ ఆటలప్పుడు అప్రమత్తత కీలకం.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ముప్పు పొంచి ఉందని గ్రహించాలి. అనుక్షణం జాగ్రత్తలు తీసుకుంటే ఒక పూట బడుల ప్రక్రియ విజయవంతం అవుతుంది..

మధ్యాహ్నం వేళ

  •  బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వేళ పిల్లలను ఆటలాడుకోవడం కోసం బయటకు వెళ్లనీయవద్దు..
  •  మధ్యాహ్నం భోజనం చేశాక గంట తర్వాత పాలు, టెంకాయ నీరు, పండ్ల రసాలు వంటి ధ్రవపదార్థాలు ఇవ్వాలి..
  •  కాచి చల్లార్చిన లేదా శుద్ధ జలం ఇవ్వాలి.. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకునేలా చూడాలి
  •  పిల్లలు తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ బారిన పడకుండా చూడాలి..

ఆహారం.. అలవాటు

  •  పెందలాడే బడికి వెళ్లాలంటే తొందరగా నిద్రలేవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఇడ్లీ అయితే భేష్‌. పండ్లయినా ఫర్వాలేదు.
  • అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో కూరగాయలకే ప్రాధాన్యమివ్వాలి.
  •  మాంసాహారానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం..
  •  బడిలో ఉండే సమయంలో అప్పుడప్పుడు ద్రవ పదార్థాలు, పానీయాలు, నీరు తీసుకునేలా ఉపాధ్యాయులకు సూచిస్తే బాగుంటుంది.
  • చదువుకు ప్రణాళిక ఉండాలి
  •  ఒంటి పూట బడులని చదువులకు దూరం కావద్దు. మధ్యాహ్నం ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకుంటే మేలు.
  •  ఆటలాడుకునే సమయం పోను మిగతాది చదువుకు కేటాయించాలి..
  •  రాత్రి వేళ త్వరగా పడుకుంటే ఉదయం నిద్ర లేవడంలో ఇబ్బందులుండవు..

ఇలా చేయండి

  •  పిల్లలు తెలుపు రంగు కాటన్‌ దుస్తులు వేసుకునేలా చూడాలి..
  •  పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు నెత్తిన ఛత్రం లేదా టోపీ లేదా దస్తీ చుట్టాలి..
  •  ఇంటికి వచ్చాక భోజనం చేయడానికి ముందు, అలాగే మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కునేలా పిల్లలకు తర్ఫీదునివ్వాలి..
  • బయట విక్రయించే పదార్ధాలు తినకుండా చూడాలి..
  •  అపరిశుభ్ర వాతావరణంలో విక్రయించే శీతల పానీయాలు తాగొద్దని చెప్పాలి..

ఈత.. జర జాగ్రత్త

  •  ఒంటి పూట బడి.. వేసవి తాపం నేపథ్యంలో పిల్లలు ఏదో ఒక వంకతో నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. తల్లిదండ్రుల కళ్లుగప్పి వెళ్తారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా పిల్లలను కనిపెడుతుండాలి.
  •  పట్టణాలు, పల్లెల్లో వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో పెద్దగా నీళ్లు లేవు. నీళ్లు ఎక్కడున్నాయే అడ్రస్‌ పిల్లలకు ఇట్టే తెలుస్తుంది.. అధికారులు కూడా ఆయా ప్రదేశాల్లో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి.
  •  శిక్షకుడి పర్యవేక్షణలో ఈత నేర్చుకుంటే పర్వాలేదు..
  •  మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఈతకు వెళ్లకపోవడం మంచిది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని