Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Mar 2023 13:33 IST

1. CRDA: 14 ఎకరాల వేలానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు.. ధరెంతంటే?

సీఆర్డీఏ పరిధిలోని 14 ఎకరాల భూమి వేలానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవులూరు సమీపంలోని బైపాస్‌ వద్ద 10 ఎకరాలు, పిచ్చుకలపాలెం వద్ద 4 ఎకరాలను ఈ-ఆక్షన్‌ పోర్టల్ ద్వారా వేలం వేయాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన అధికారులు ధరను ఖరారు చేశారు. నవులూరు వద్ద ఎకరా రూ.5.94కోట్లు, పిచ్చుకలపాలెం వద్ద ఎకరా రూ.5.41కోట్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేలానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌, భారాసను లొంగదీసుకోలేరు: కవిత

దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు ఇవ్వడంపై భారాస ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రేపు దిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొందని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు. ‘‘ముందస్తు అపాయింట్‌మెంట్ల దృష్ట్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయసలహా తీసుకుంటాను. కేసీఆర్‌, భారాసను లొంగదీసుకోవడం కుదరదని భాజపా తెలుసుకోవాలి’’ అని కవిత ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రూ.149 డేటావోచర్‌తో 15 ఓటీటీలుండే ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌నకు యాక్సెస్‌

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel Recharge) రూ.200లోపే ఓటీటీ ప్రయోజనాలను (OTT Benefits) అందిస్తోంది. వివిధ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లను వీక్షించాలనుకునే యూజర్లకు ఇది మంచి ఆఫర్‌. రూ.149 డేటా వోచర్‌లో డేటాతో పాటు ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్రయోజనాలను (OTT Benefits) కూడా కల్పిస్తోంది. దీన్ని ఇటీవలే ప్రవేశపెట్టింది. ఎక్స్‌ట్రీం ప్రీమియం (Airtel Xstream) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో మార్పులు చేసి దీన్ని తీసుకొచ్చినట్లు టెలికాం నిపుణులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాన్పూర్‌కు జ్వరమొచ్చింది.. H3N2 లక్షణాలతో భారీగా ఆసుపత్రులకు జనం

కొవిడ్‌ తగ్గుముఖం పట్టిందనుకొంటున్న సమయంలో హెచ్‌3ఎన్‌2(H3N2) ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలోని హాల్లెట్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజులో జ్వరం, నిరంతరాయంగా దగ్గు, శ్వాసకోశ సమస్యలతో 200 కేసులు వచ్చాయి. వీటిల్లో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి బయట రోగులు బారులు తీరారు. మరోవైపు ప్రైవేటు వైద్యశాలలకు కూడా జ్వర బాధితులు పోటెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఆస్కార్‌’ అలా వచ్చింది.. రికార్డులకెక్కిన వారెవరంటే?

‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ (Academy of Motion Picture Arts and Sciences) అందించే ట్రోఫీని తొలుత ‘అకాడమీ అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’గా పిలిచేవారు. తర్వాత అది ‘ఆస్కార్‌’గా మారింది. దీని వెనక ఓ కథ ఉంది. తొలినాళ్లలో అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన మార్గరెట్‌ హెర్రిక్‌.. ఆ ట్రోఫీని చూస్తుంటే తన అంకుల్‌ని చూస్తున్నట్టే ఉందని అన్నారట. ఆ తర్వాత, హాలీవుడ్‌ కాలమిస్ట్‌ ఒకరు తన వ్యాసంలో అకాడమీ అందించే ట్రోఫీని ఆస్కార్‌గా అభివర్ణించారట. అలా ఆస్కార్‌ అనే పేరు వాడుకలోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బంగారం అంటే నగలే కాదు.. ఇవీ ఉన్నాయ్‌..!

బంగారంతో (Gold) మహిళలకు (Womens) విడదీయరాని బంధం ఉంది. పండగైనా, శుభకార్యమైనా బంగారం కొనుగోలుకు (Gold Investment) మహిళలు ఆసక్తి చూపిస్తుంటారు. మన పెద్దలు కూడా ఇదే చెప్పేవారు. చేతిలో కొంత నగదు ఉన్నప్పుడు ఎంతో కొంత బంగారం కొనుక్కోమనేవారు. భవిష్యత్‌లో ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ బంగారం ఉయోగపడుతుందని చాలా దూర దృష్టితో చెప్పిన మాట ఇదీ. ఓ విధంగా ఇలా కొనుగోలు చేసిన బంగారం ఆ రోజుల్లో అత్యవసర నిధిలా ఉపయోగపడేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాక్ మాటలకు స్పందించడం కూడా దండగే.. భారత్‌ ఘాటు విమర్శలు

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ (Pakistan)కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐరాసలో మహిళల భద్రతపై చర్చ సందర్భంగా కశ్మీర్‌ (Kashmir Issue) అంశాన్ని లేవనెత్తిన దాయాది పాక్‌కు భారత్‌ (India) గట్టి సమాధానమిచ్చింది. అలాంటి ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే అని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి (United Nations) భద్రతా మండలిలో ‘మహిళ, శాంతి, భద్రత’ అనే అంశంపై చర్చ జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆసీస్‌తో నాలుగో టెస్టు.. శ్రీకర్‌ భరత్‌కు మద్దతుగా నిలిచిన ద్రవిడ్‌

తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ (KS Bharat) ప్రస్తుతం ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో (IND vs AUS) ఆడుతున్నాడు. అయితే గత మూడు టెస్టుల్లో 8, 6, 23*, 17, 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో నాలుగు టెస్టుకు అతడిపై వేటు తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే మరో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ అహ్మదాబాద్‌ టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. అతడి శిక్షణను టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) దగ్గరుండి పర్యవేక్షించినట్లు వార్తలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నాపై లైంగిక వేధింపులు.. చెప్పినందుకు సిగ్గుపటడం లేదు: ఖుష్బూ

తన తండ్రి వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఇటీవల సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ (kushboo sundar)సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు తాను ఏమాత్రం సిగ్గుపడటంలేదన్నారు. ‘‘నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యం చేసి నిజాయతీగా అందరికీ తెలిసేలా చేశాను. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. అలాగే ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు’’ అని ఆమె వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గ్యాస్‌ పైపులైన్‌ను ఉక్రెయిన్‌ అనుకూలురే పేల్చివేసి ఉండొచ్చు.. : అమెరికా

 జర్మనీ సహా ఇతర ఐరోపా దేశాలకు గ్యాస్‌ సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్‌ పైపులైన్‌ పేల్చివేతపై అమెరికా(USA) సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. తమకు వచ్చిన ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ఉక్రెయిన్‌(Ukraine) అనుకూల గ్రూపు ఈ పనిచేసి ఉండొచ్చని పేర్కొంది. అమెరికా దర్యాప్తు బృందాలు సంపాదించిన సరికొత్త ఇంటెలిజెన్స్‌ సమాచారం ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ దాడిలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లేదా ఆయన సహాయకుల హస్తం లేదని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు