Oscar Awards: ‘ఆస్కార్‌’ అలా వచ్చింది.. రికార్డులకెక్కిన వారెవరంటే?

95వ ఆస్కార్‌ వేడుకలు ఈ నెల 12న జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆస్కార్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు చూద్దాం..

Published : 08 Mar 2023 11:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు ‘ఆస్కార్‌’ అసలు పేరేంటి? తొలిసారిగా ఉత్తమ నటుడు, నటిగా నిలిచిందెవరు? తదతర ప్రశ్నలకు సమాధానం మీకు తెలుసా?  95వ ఆస్కార్‌ ప్రదానోత్సవం (Oscars Awards 2023) ఈ మార్చి 12న (లాస్‌ ఏంజిల్స్‌లో) జరగనున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

 • ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ (Academy of Motion Picture Arts and Sciences) అందించే ట్రోఫీని తొలుత ‘అకాడమీ అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’గా పిలిచేవారు. తర్వాత అది ‘ఆస్కార్‌’గా మారింది. దీని వెనక ఓ కథ ఉంది. తొలినాళ్లలో అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన మార్గరెట్‌ హెర్రిక్‌.. ఆ ట్రోఫీని చూస్తుంటే తన అంకుల్‌ని చూస్తున్నట్టే ఉందని అన్నారట. ఆ తర్వాత, హాలీవుడ్‌ కాలమిస్ట్‌ ఒకరు తన వ్యాసంలో అకాడమీ అందించే ట్రోఫీని ఆస్కార్‌గా అభివర్ణించారట. అలా ఆస్కార్‌ అనే పేరు వాడుకలోకి వచ్చింది.
 • అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం తొలిసారి 1929లో జరిగింది. 270కిపైగా అతిథులు ఫస్ట్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అకాడమీ వేడుకలను ప్రసారం చేయడాన్ని1953 నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం 200కిపైగా దేశాల ప్రజలు ఆస్కార్‌ వేడుకలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
 • మొదటి సారి ఆస్కార్‌ను ఉత్తమ నటుడిగా ఎమిల్‌ జెన్నింగ్స్‌ అందుకున్నారు. ‘ది లాస్ట్‌ కమాండ్‌’ చిత్రానికిగాను ఇది దక్కింది. జనేట్‌ గేనోర్‌.. తొలిసారిగా ఉత్తమ నటి అవార్డు దక్కించున్నారు. ‘సెవెన్త్‌ హెవెన్‌’ సినిమాలోని నటనకు ఆమెకు ఆస్కార్‌ లభించింది.
 • పదేళ్లకే ఆస్కార్‌ అందుకున్న నటిగా టేటమ్‌ ఒ నీల్‌ చరిత్రకెక్కింది. 1973లో తెరకెక్కిన ‘పేపర్‌ మూన్‌’ అనే చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటిగా ఆమెకు ఈ పురస్కారం దక్కింది.
 • 83 ఏళ్ల వయసులో ఆస్కార్‌ పురస్కారం దక్కించుకుని ఆంథోనీ హాప్‌కిన్స్‌ రికార్డు సృష్టించారు. 2020లో విడుదలైన ‘ది ఫాదర్‌’ సినిమాలోని నటనకు ఆంథోనీ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్నారు.
 • ‘క్యాబరెట్‌’ సినిమాకుగాను 1972లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న లిజా మిన్నెల్లికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఆమె తల్లిదండ్రులూ ఆస్కార్‌ పురస్కారం పొంది ఉండడం. లిజా తల్లి జ్యూడీ గార్లాండ్‌ 1939లో హానరరీ అవార్డు, ఆమె తండ్రి విన్సెంట్‌ మిన్నెల్లి 1958లో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ స్వీకరించారు.
 • అకాడమీ అవార్డు అందుకున్న తొలి మహిళా దర్శకురాలిగా కేథరిన్‌ బిగ్లో నిలిచారు. ఈమె 2010లో ‘ది హర్ట్‌ లాకర్‌’ చిత్రానికి ఈ పురస్కారం అందుకున్నారు.
 • అత్యధికంగా ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్న వ్యక్తి వాల్ట్‌ డిస్నీ. నిర్మాత, నటుడు, రచయిత అయిన ఈయన మొత్తం 59 నామినేషన్లు పొంది 25 గెలుచుకున్నారు.
 • అత్యధికంగా ఆస్కార్‌ నామినేషన్లు దక్కించుకున్న నటి మెరిల్‌ స్ట్రీప్‌. ఉత్తమ నటిగా 21 సార్లు నామినేట్‌ అయిన ఆమె మూడు సార్లు విజేతగా నిలిచారు.
 • ఆస్కార్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన దుస్తులను ధరించి, రెడ్‌ కార్పెట్‌పై (2013లో) హొయలొలికించిన నటిగా జెన్నిఫర్‌ లారెన్స్‌ ట్రెండ్‌ సెట్‌ చేశారు. అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సు ధర సుమారు 4 మిలియన్‌ డాలర్లు.
 • ఆస్కార్‌ దక్కించుకున్న ఏకైక కొనసాగింపు (సీక్వెల్‌) చిత్రం ‘ది గాడ్‌ఫాదర్‌: పార్ట్‌ 2’. 1974లో విడుదలైంది ఈ సినిమా.
 • బెస్ట్‌ పిక్చర్‌గా ఆస్కార్‌ పురస్కారం పొందిన ఒకే ఒక అడల్ట్‌ కంటెంట్‌ సినిమా ‘మిడ్‌నైట్‌ కౌబాయ్‌’ (1969).
 • ఒకే చిత్రం నుంచి ఒకేసారి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి అవార్డులు గెలుచుకున్న వారులేరు. ‘ఏ స్ట్రీట్‌కార్‌ నేమ్‌డ్‌ డిసైర్‌’ (1951) విషయంలో బెస్ట్‌ యాక్టర్‌, ‘నెట్‌వర్క్‌’ (1976)కు సంబంధించి బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ మిస్‌ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు వాటిని మిస్‌ అవకపోయి ఉంటే కొత్త రికార్డు సృష్టించి ఉండేవి.
 • 11 విభాగాల్లో అవార్డులు దక్కించుకుని ‘బెన్‌- హర్‌’ (1959), టైటానిక్‌ (1997), ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ ది కింగ్‌’ (2003) సినిమాలు హిస్టరీ క్రియేట్‌ చేశాయి.
 • బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఎక్కువ అవార్డులు (10) అందుకున్న దేశంగా ఇటలీ నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు