Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 11 Aug 2022 21:16 IST

1. 5వేల అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో దాదాపు 5గంటలకు పైగా సాగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది.  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 36 లక్షల ఆసరా పింఛన్లకు అదనంగా  కొత్తగా మరో 10 లక్షల పింఛన్లు ఇవ్వాలని మంత్రి వర్గం తీర్మానించింది.  ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈనెల 21న శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

2. మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు చాలా కీలకం: రేవంత్‌రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అనుబంధ సంఘాల పాత్ర చాలా కీలకమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికతోపాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు పట్టుదలతో పనిచేయాలని కోరారు. ఈ మేరకు గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన అనుబంధ సంఘాల ఛైర్మన్‌ల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు ఉపఎన్నిక చాలా కీలకమన్నారు. పూర్తి స్థాయిలో కష్టపడి భాజపా, తెరాసలకు బుద్ధి చెప్పాలన్నారు.


Video: స్వాతంత్య్ర స్ఫూర్తి ఉత్సాహంగా ‘ఫ్రీడమ్‌ రన్‌’


3. యమునా నదిలో 35మందితో పడవ బోల్తా.. నలుగురి మృతి.. ముమ్మర గాలింపు

రాఖీ పండుగ వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో బాందా జిల్లాలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదం సమయంలో పడవలో దాదాపు 30 నుంచి 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 
మర్క నుంచి ఫతేపూర్‌ జిల్లాలోని జారౌలి ఘాట్‌కు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీసినట్టు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పడవలో రాఖీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

4. ఎంపీ కేశినేని నాని పిటిషన్‌కు విచారణ అర్హత ఉంది: ఏపీ హైకోర్టు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నగర పంచాయతీలో ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవడంపై హైకోర్టు విచారణ జరిపింది.  ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కొండపల్లి వైకాపా కౌన్సిలర్‌ల తరఫున వేసిన పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరిగంది. ఇలాంటి పిటిషన్‌లకు హైకోర్టులో విచారణ అర్హత లేదని, సివిల్‌ కోర్టుకు వెళ్లాలని వైకాపా కౌన్సిలర్‌ల తరఫున న్యాయవాది సీతారాం వాదనలు వినిపించారు. 

5. కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలు.. స్పందించిన బొమ్మై!

కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చుతున్నారంటూ వస్తోన్న ఊహాగానాలను ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై కొట్టిపారేశారు. అవన్ని నిరాధారమైనవని, అబద్ధాలేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం స్థిరంగా ఉందని, అలాగే కొనసాగుతుందనీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధితోపాటు పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. ఇటీవల కరోనా బారిన పడి, కోలుకున్న సీఎం బొమ్మై.. గురువారం తిరిగి సాధారణ కార్యకలాపాలను ప్రారంభించారు.


Video: మరో వ్యాపారంలోకి అదానీ గ్రూప్‌.. అనుమతులు సిద్ధం!


6. ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్‌ వీడియోపై పృథ్వీరాజ్‌ కామెంట్‌

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై సినీ నటుడు పృథ్వీరాజ్‌ స్పందించారు. అంగబలం, అర్ధబలం ఉండటంతోనే గోరంట్ల మాధవ్‌ను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ‘‘ఈనెల 4న బయటపడిన ఆ దరిద్రపు వీడియోకి సంబంధించి ఎంపీ మాధవ్‌ వాడిన భాష ఆ పార్టీ నేతలకు బాగా నచ్చినట్టుంది. ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం. పార్లమెంట్‌లో తెలుగు ఎంపీలకు ఒక మంచి చరిత్ర ఉంది. ఇప్పుడు గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంతో అంతా తుడిచిపెట్టుకు పోయింది’’ అన్నారు.

7. సంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. ఇదెక్కడి ప్రభుత్వం..?

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఉచిత హామీలు, పథకాలపై భాజపా, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రధాని మోదీపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన.. పేదవాళ్లపై పన్నుల భారం మోపుతూ, ధనికులకు మాత్రం భారీ స్థాయిలో రుణ మాఫీలు చేస్తోందని ఆరోపించారు.

8. కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు బాక్సర్లు అదృశ్యం!

కామన్వెల్త్‌ క్రీడలు ఘనంగా ముగిశాయి. ఆటగాళ్లు ఇప్పటికే స్వదేశానికి పయనం అయ్యారు. అయితే, కొన్ని దేశాల అధికారులు మాత్రం మా దేశ బృందంలోని కొందరు క్రీడాకారులు ఇంక చేరుకోలేదని చెబుతున్నారు. మొన్న శ్రీలంకకు చెందిన 9 మంది అథ్లెట్లు, ఒక అధికారి తప్పిపోయినట్లు లంక అధికారులు వెల్లడించారు. తాజాగా తమ దేశానికి  చెందిన ఇద్దరు బాక్సర్లు మిస్‌ అయినట్లు పాకిస్థాన్‌ బాక్సింగ్ ఫెడరేషన్ యూకేలోని పాక్‌ హై కమిషన్‌కు, లండన్ అధికారులకు తెలియజేసింది. 


Video: అలా గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!


9. ఇక.. అటల్ పెన్షన్‌ యోజనకు వారు అనర్హులు..!

కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకమైన అటల్ పెన్షన్‌ యోజన (ఏపీవై)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ స్కీమ్‌కు అనర్హులని ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘‘అక్టోబరు 1, 2022వ తేదీ నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్‌ యోజనలో చేరేందుకు అనర్హులు. అయితే ఆ తేదీ కంటే ముందే స్కీంలో చేరిన వారికి ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ, ఆదాయపు పన్ను చెల్లింపుదారులెవరైనా అక్టోబరు 1 తర్వాత ఏపీవైలో చేరినట్లు గుర్తిస్తే వెంటనే వారి ఖాతాను మూసివేస్తాం. అప్పటివరకు వారు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చందాదారులకు చెల్లిస్తాం’’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

10. స్వాతంత్ర్య స్ఫూర్తి.. 15న లఖ్‌నవూలో వినూత్నంగా..!

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న వినూత్న దేశభక్తి కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. పంద్రాగస్టు రోజున యూపీ రాజధాని లఖ్‌నవూ వ్యాప్తంగా జాతీయ గీతాలాపనతో స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15 రోజున సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మువ్వన్నెల జెండాను ఎగురవేసిన తర్వాత 52 సెకెన్ల పాటు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ద్వారా జాతీయ గీతాన్ని వినిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని