Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 02 Jun 2022 16:58 IST

1. చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయాలని కేసీఆర్‌ కుట్రపన్నారు: మాజీ మంత్రి చంద్రశేఖర్‌

ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగోలులోని తట్టిఅన్నారం జె.కన్వెన్షన్‌లో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్ష సాధన’ సభలో చంద్రశేఖర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తనను తాను పెళ్లాడనున్న యువతి

2. ఎంపీ రఘురామను ఎందుకు సస్పెండ్ చేయలేదు?: కొత్తపల్లి సుబ్బారాయుడు

తాను వైకాపాను చిన్న మాట కూడా అనలేదని.. తప్పు చేయకుండా వేటు వేయడం ఎంతవరకు సమంజసమని వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు. తనపై వేటు వేసిన పార్టీ.. ఎంపీ రఘురామను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా సస్పెండ్ చేయడం దారుణమన్నారు. సస్పెన్షన్‌ కారణాలను సాయంత్రంలోగా చెప్పాలని డిమాండ్ చేశారు.  

అవసరమైతే చంద్రబాబుకే రాజీనామా లేఖ ఇస్తా: దివ్యవాణి

3. ‘రెండు కాళ్లు విరిచేస్తా.. నీ సంగతి చూస్తా’

మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి బెదిరింపుల ఆడియో కలకలం రేపుతోంది. అమలాపురం మండలం ఈదరపల్లి వైకాపా ఎంపీటీసీ అడపా సత్తిబాబును బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అమలాపురంలో గత నెల 24న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి ఎంపీటీసీ సత్తిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తమ ఇంటిని తగులబెడతారా అంటూ మంత్రి కుమారుడు.. సత్తిబాబుకు ఫోన్‌ చేసి తీవ్ర స్థాయిలో బెదిరించారు.

4. కమలం కండువా కప్పుకున్న హార్దిక్ పటేల్‌

పాటిదార్ అనామత్ ఆందోళన్ ఉద్యమంతో ప్రజాదరణ పొందిన హార్దిక్ పటేల్.. గురువారం భాజపాలో చేరారు. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో పార్టీ కార్యాలయంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఆ రాష్ట్రం కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో హార్దిక్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి, భాజపాలో చేరారు. తన చేరికపై ఈ రోజు ఉదయం ట్విటర్‌లో పోస్టు పెట్టారు.

క్రియాటిన్ పెరిగితే.. కిడ్నీలకు ప్రమాదమా..?

5. ఒక్క ఛార్జింగ్‌తో 528 కి.మీల ప్రయాణం.. కియా ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది..!

దక్షిణకొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా ఇండియా (Kia India).. దేశీయ విద్యుత్తు కార్ల విపణిలోకి అడుగుపెట్టింది. EV6 పేరుతో తొలి ఎలక్ట్రిక్‌ కారును గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు దీని ప్రారంభ ధర రూ.59.95 లక్షలు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. రెండు ట్రిమ్‌ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. 

6. ఎయిరిండియా ఉద్యోగులకు VRS‌.. టాటాల నిర్ణయం

అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌.. దాన్ని పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టింది. సంస్థలో శాశ్వత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. శాశ్వత ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూనే సంస్థకు కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు వివిధ విభాగాల్లో నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకొని 55 ఏళ్లు పైబడిన వారు ఈ వీఆర్‌ఎస్‌ను ఎంచుకోవచ్చు.

‘నగాదారి’లో అంటూ వచ్చేసిన రానా,సాయిపల్లవి

7. కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు.. అజిత్‌ డోభాల్‌తో అమిత్‌ షా భేటీ

జమ్మూకశ్మీర్‌లో సామాన్య పౌరులపై ఉగ్రవాదులు వరుసగా లక్షిత హత్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో నార్త్‌ బ్లాక్‌లో జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. 

8. ఆధార్‌ వల్ల ప్రభుత్వానికి ₹2 లక్షల కోట్లు ఆదా

ప్రపంచంలోనే అత్యుత్తమ బయోమెట్రిక్‌ ఆధారిత గుర్తింపు కార్యక్రమం ‘ఆధార్‌’ అని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పునాదిలా నిలుస్తోన్న ఆధార్‌తో నకిలీలను గుర్తించడం ద్వారా ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్లకుపైగా ఆదా అయినట్లు చెప్పారు. ఆధార్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు తీసుకున్న చర్యలపై దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అమితాబ్‌కాంత్‌ ఈ వివరాలు వెల్లడించారు.

9. మొన్న జైన్‌.. తర్వాత అరెస్టయ్యేది ఈ మంత్రే..!

దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ అరెస్టు.. భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను ఇరికిస్తున్నారని, త్వరలో ఆయన్ను కూడా అరెస్టు చేయనున్నారని ఆరోపించారు. జైన్ అరెస్టుకు కొన్ని నెలల ముందు ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.

10. Seagrass: ప్రపంచంలోనే అతిపెద్ద మొక్క

ప్రపంచంలోనే అతి పెద్ద మొక్కను ఆస్ట్రేలియా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ‘షార్క్‌ బే’లో నీటి అడుగున పెరుగుతున్న ఈ మొక్క ఏకంగా 180 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. దీనికి సంబంధించి వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ఫ్లిండర్స్‌ యూనివర్సిటీల పరిశోధకులు చేపట్టిన అధ్యయన వివరాలు.. ‘ప్రొసీడింగ్స్ ఆఫ్‌ ది రాయల్ సొసైటీ బీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని