BJP: చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయాలని కేసీఆర్‌ కుట్రపన్నారు: మాజీ మంత్రి చంద్రశేఖర్‌

ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 21 Nov 2022 15:31 IST

హైదరాబాద్‌: ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగోలులోని తట్టిఅన్నారం జె.కన్వెన్షన్‌లో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్ష సాధన’ సభలో చంద్రశేఖర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2001కి ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయాలని కేసీఆర్‌ కుట్ర పన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యేలను సంప్రదించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. 61వ వ్యక్తిగా జ్యోతుల నెహ్రూను సంప్రదించారు. జ్యోతుల నెహ్రూ వెళ్లి చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు’’ అని వెల్లడించారు.

‘‘2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైంది. అంతకు ముందు కేసీఆర్‌ గారు, నేను ఒకేసారి మంత్రులం అయ్యాం. మరలా జరిగిన ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే కేసీఆర్‌కు అధికార దాహం ఎంత ఉందో చెప్పడానికి ఉదాహరణ మాత్రమే. కేసీఆర్‌కు మంత్రి పదవి రాని పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్‌గా ఉండి కూడా చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. తెలంగాణలో ఆరోజు ఉన్న ఎమ్మెల్యేల్లో చీలిక తేవాలని అనేక ప్రయత్నాలు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నేను.. మరికొంత మంది మిత్రులతో కలిసి చంద్రబాబును దించేయాలని కుట్ర పన్నారు. చంద్రబాబును దించేసిన వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని భావించారు. ఈ క్రమంలో 3.. 4 నెలలు చర్చలు, ప్రయత్నాలు జరిగాయి. ఒక సమయంలో... చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. చంద్రబాబును దించడానికి దగ్గరికొస్తున్నాం కాబట్టీ ఒకరోజు రాత్రి ప్లాన్‌ చేశాం. కేసీఆర్‌ ఏం చేప్పారంటే.. సీఎంను దించటానికి 60మంది ఎమ్మెల్యేలు చాలు. 20 హెలికాప్టర్లు తెచ్చుకుందాం. 20 హెలికాప్టర్లలో నేరుగా గవర్నర్‌ వద్దకు వెళ్దాం అని చెప్పారు. చంద్రబాబును దించేసి వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలని ఆకాంక్ష. కానీ, 61వ వ్యక్తిగా జ్యోతుల నెహ్రూను సంప్రదించారు. జ్యోతుల నెహ్రూ వెళ్లి చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. కేసీఆర్‌కు ఉన్నంత అధికార దాహం ప్రపంచంలో ఎవరికీ ఉండకపోవచ్చు’’ అని చంద్రశేఖర్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని