Hardik Patel: కమలం కండువా కప్పుకున్న హార్దిక్ పటేల్‌

పాటిదార్ అనామత్ ఆందోళన్ ఉద్యమంతో ప్రజాదరణ పొందిన హార్దిక్ పటేల్.. గురువారం భాజపాలో చేరారు.

Published : 02 Jun 2022 14:43 IST

గాంధీనగర్: పాటిదార్ అనామత్ ఆందోళన్ ఉద్యమంతో ప్రజాదరణ పొందిన హార్దిక్ పటేల్.. గురువారం భాజపాలో చేరారు. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో పార్టీ కార్యాలయంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఆ రాష్ట్రం కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో హార్దిక్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి, భాజపాలో చేరారు. తన చేరికపై ఈ రోజు ఉదయం ట్విటర్‌లో పోస్టు పెట్టారు.

దేశ, రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల నిమిత్తం నేటి నుంచి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాను. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం కోసం సైనికుడిగా పనిచేస్తాను’ అని హార్దిక్ ట్వీట్ చేశారు. 28 ఏళ్ల ఈ పాటిదార్‌ నేత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర యూనిట్‌లో కీలక స్థానంలో కొనసాగుతూ వచ్చారు. అయితే హస్తం పార్టీ విధానాలతో అసంతృప్తికి గురైన ఆయన.. బహిరంగంగానే విమర్శలు చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల తర్వాత రాజీనామా చేసి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. 

అదే సమయంలో భారతీయ జనతా పార్టీపై ప్రశంసలు కురిపించారు. అయోధ్య తీర్పు, ఆర్టికల్‌ 370 రద్దు సమయంలోనూ భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన కాషాయ పార్టీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ నేడు భాజపా కండువా కప్పుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని