Updated : 26 Jun 2022 09:03 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. జులై 1 నుంచి ప్రొబేషన్‌

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారందరికి ఈ నెలాఖరులోగా ప్రొబేషన్‌ ఖరారు చేయాలంటూ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శుల మూలవేతనం రూ.23,120 నుంచి ప్రారంభమవుతుంది. 

2. పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్‌

గుజరాత్‌ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్‌ వేసిన జాకియా జాఫ్రీకి న్యాయసాయం అందించిన సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను రాష్ట్రానికి చెందిన ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్‌లో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఆమెను ముంబయిలో నిర్బంధించారు. అనంతరం అహ్మదాబాద్‌కు తరలించారు. గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌నూ అరెస్టు చేశారు. 

3. కర్ణాటక ‘ఎత్తు’లు..!

కర్ణాటక నిర్ణయం తెలంగాణలోని 25వేల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఆ రాష్ట్రంలో భీమానదిపై జొలదడిగి- గూడూరు బ్యారేజీ దిగువన కొత్త బ్యారేజీని నిర్మిస్తున్నారు. అంతకు ముందు అక్కడ చిన్న బ్యారేజీ ఉంది. ఇది పూర్తయితే భీమాపై ఆధారపడ్డ తెలంగాణ రైతులకు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం 44 భారీ గేట్లతో కొత్త బ్యారేజీ నిర్మిస్తుండడంతో భవిష్యత్తులో భారీ వరద వస్తే తప్ప భీమా నీరు దిగువకు రాని పరిస్థితి నెలకొనబోతోంది.

4. ఈసారి ఫలితాలతో పాటే టెట్‌ తుది ‘కీ’

విద్యాశాఖ ఈ సారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) తుది ‘కీ’ని ఫలితాలతోపాటే ఇవ్వనుంది. గతంలో ఫలితాలకు మూడు రోజుల ముందు ‘కీ’ని ఇచ్చేవారు. ఈసారి అందుకు భిన్నంగా ఫలితాలతోపాటు దాన్ని వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. టెట్‌ ఫలితాలను జూన్‌ 27న విడుదల చేస్తామని నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పేర్కొంది. 

5. ఊరూరా క్రీడా ప్రాంగణాలు

రాష్ట్రంలో ఊరూరా స్థలాలను గుర్తించి క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు చొరవ చూపాలని.. జిల్లా, మండల అధికారులు, సర్పంచులు కృషి చేయాలన్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు. శనివారం ఆయన తమ కార్యాలయంలో క్రీడలు, పర్యాటక శాఖలపై సమీక్ష నిర్వహించారు.

6. అత్యున్నత స్థానానికి న్యాయవ్యవస్థ కీర్తి

‘నేను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంతవరకూ న్యాయార్థం వచ్చేవారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఏ మాత్రం తలవంపులు లేకుండా భారత న్యాయవ్యవస్థ కీర్తిని అత్యున్నత స్థానానికి తీసుకెళ్తానని మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నా..’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్‌లో ‘ఉత్తర అమెరికా తెలుగు సమాజం’ ఏర్పాటు చేసిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో సతీమణి శివమాలతో సహా పాల్గొన్నారు.

7. జులై 8 నుంచి యూజీసీ నెట్‌

యూజీసీ నెట్‌ పరీక్షలు జులై 8వ తేదీన మొదలుకానున్నాయి. 2021 డిసెంబరు, 2022 జూన్‌ పరీక్షలను కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షల తేదీలను యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ శనివారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. పరీక్షల కాలపట్టికను త్వరలో ఎన్‌టీఏ వెబ్‌సైట్లో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. జులై 8, 9, 11, 12, ఆగస్టు 12, 13, 14 తేదీల్లో యూజీసీ నెట్‌ నిర్వహించనున్నారు.

8. తిరుమలలో భక్తుల రద్దీ సర్వదర్శనానికి 20 గంటలు

శ్రీవారి దర్శనానికి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. సర్వదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి వరాహస్వామి అతిథిగృహం సమీపం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఉన్నారు. వీరు శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు 20 గంటలకుపైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. 

9. బ్రిటిష్‌ ప్రధానికి కొత్త చిక్కు!

రెండు పార్లమెంటు ఉపఎన్నికల్లో పాలక కన్సర్వేటివ్‌ పార్టీ ఓడిపోవడంతో గడ్డుస్థితిని ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌కు... తాజాగా సొంత పార్టీ నుంచే సవాలు ఎదురవుతోంది! జాన్సన్‌ విధేయుడు, పార్టీ సహాధ్యక్షుడు అయిన ఆలివర్‌ డౌడెన్‌ పార్టీ పదవికి రాజీనామా చేయడం ప్రధానమంత్రిని దుర్బల స్థితిలోకి నెట్టింది. 

10. నెట్‌ఫ్లిక్స్‌ ఇక చౌక!

ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్‌ కథే వేరు. అన్నిటికి కంటే అదే ఎక్కువ ధరల్లో ప్లాన్లను అమలు చేస్తోంది. దీంతో కొంత మందికి దూరమైంది. ఇపుడు అందరికీ చేరువ కావడం కోసం వ్యాపార ప్రకటనలతో కూడిన ఒక చౌక ప్లాన్‌ను తీసుకురావడంపై పనిచేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సహ-సీఈఓ టెడ్‌ సారండోస్‌ ధ్రువీకరించారని ఒక ఆంగ్ల వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ కథనం ప్రకారం.. ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదార్ల సంఖ్యను భారీగా పెంచుకోవాలని భావిస్తోంది. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని