Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 28 Jun 2022 20:59 IST

1. యువభారత్‌ సామర్థ్యం తెలపాలనే టీహబ్‌ నెలకొల్పాం : సీఎం కేసీఆర్‌

ప్రపంచానికి యువభారత్‌ సామర్థ్యాన్ని తెలపాలనే టీహబ్‌ను నెలకొల్పామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఒకేసారి 4 వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు నిర్మించిన అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయని, అంకురాల ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు.

జగన్‌..ఇంకెన్నాళ్లు మహిళలను మోసం చేస్తారు?: అనిత

2. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ

హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తంగా ఉంచింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. 

3. ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో రూ.800కోట్లు మాయం

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్‌ అయ్యాయని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.83వేలు విత్‌డ్రా చేశారని పేర్కొన్నారు. గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి వేశారని గుర్తు చేశారు. తాజాగా మొత్తం 90వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. 

Prabhas: ప్రభాస్‌.. 20ఏళ్లలో.. 20 దేశాల్లో హీరో: కృష్ణంరాజు

4. ‘మహా’ సంక్షోభం వేళ.. కార్యాచరణ సిద్ధం చేస్తోన్న భాజపా

శివసేన రెబల్‌ నేతల తిరుగుబాటుతో మొదలైన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతోన్న ఏక్‌నాథ్‌ శిందే వర్గం త్వరలోనే ముంబయికి చేరుకుంటామని చెబుతోంది. ఇలా మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రెబల్‌ నేతలు ప్రయత్నాలు చేస్తోన్న వేళ.. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న భాజపా మెల్లగా పావులు కదుపుతున్నట్లే కనిపిస్తోంది.

తెలంగాణలో కొత్తగా 459 కేసులు

5. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలన్న తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ధర్మపురి నుంచి 2018 ఎన్నికల్లో తెరాస తరఫున కొప్పుల ఈశ్వర్‌, కాంగ్రెస్‌ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పోటీ చేశారు. ఈవీఎంల వీవీ ప్యాట్‌లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్‌ గెలుపొందినట్టు ప్రకటించారని, అది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని 2019లో అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. 

6. ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి: సీఎం జగన్‌

ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌  అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, సిబ్బంది నియామకంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీలో పొరపాట్లు, అక్రమాలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతాలు తెరవాలని సూచించారు. ఈ ఖాతా నుంచే  ఆటోమేటిక్‌గా వైద్యం అందించిన ఆసుపత్రికి నగదు బదిలీ చేయాలని పేర్కొన్నారు.

అల్లూరి విగ్రహావిష్కరణ.. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం

7. ఆ ‘గన్‌’ ఇక పేలదు.. రిటైర్మెంట్‌ ప్రకటించిన మోర్గాన్‌

కొంతకాలంగా పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్న మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సహచర ఆటగాళ్లంతా చెలరేగుతుంటే నెదర్లాండ్స్‌ లాంటి చిన్న జట్టుపైనా మోర్గాన్‌ వరుసగా రెండుసార్లు డకౌటయ్యాడు. ఆపై గాయం బారిన పడటంతో ఇక ఆటకు దూరమవ్వాలనుకున్నాడు. కెరీర్‌ చరమాంకంలో ఇలా చేశాడంటే ఓకే.. కానీ 35 ఏళ్ల వయసులోనే క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. 

8. రిలయన్స్‌ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తమ కంపెనీ టెలికాం విభాగమైన జియో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ బోర్డుకు రాజీనామా చేశారు. ఈ కంపెనీ పగ్గాలను తనయుడు ఆకాశ్‌ అంబానీకి అప్పగించారు. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌ సందర్భంగా రిలయన్స్‌ జియో వెల్లడించింది.

షుగర్‌ వ్యాధి ఇబ్బంది పెడుతోందా?.. ఈ మార్పులు చేసుకోండి!

9. జీఎస్‌టీ సమావేశంలో కీలక నిర్ణయాలు.. వీటికి మినహాయింపు లేనట్లే!

GST (వస్తు సేవల పన్ను) కౌన్సిల్‌ రెండు రోజుల సమావేశంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆతిథ్య రంగం సహా వివిధ సేవలపై ఇస్తున్న మినహాయింపులను ఉపసంహరించుకుంది. రోజుకు రూ.1000లోపు ఛార్జ్‌ చేసే హోటల్‌ వసతిని పన్ను పరిధిలోకి తెచ్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత జరుగుతున్న ఈ జీఎస్‌టీ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు, ఆర్థిక మంత్రులు హాజరై పలు ప్రతిపాదలను కౌన్సిల్‌ ముందుంచారు.

10. కొలంబియా కారాగారంలో విషాదం.. 49 మంది ఖైదీలు మృతి

కొలంబియాలోని (Colombia) ఓ జైళ్లో విషాదం చోటుచేసుకుంది. జైలు నుంచి తప్పించుకునే (Prison Escape) క్రమంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 49 మంది ఖైదీలు మృతి చెందారు. మరో నలభై మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జైలులో జరిగిన ఈ సంఘటన అత్యంత విషాదమైదిగా అక్కడి జాతీయ జైళ్ల విభాగం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని