ఆ ఆలయంలో 400మంది సేవకులకు కరోనా!

ఒడిశాలో ప్రముఖ క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో 400మంది సేవకులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని తాజాగా ఆలయ అధికారులు వెల్లడించారు.

Updated : 29 Sep 2020 14:06 IST

భువనేశ్వర్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రముఖ దేవాలయాలు కూడా ప్రజల సందర్శనకు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో ఒడిశాలో ప్రముఖ క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో 400మంది సేవకులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని తాజాగా ఆలయ అధికారులు వెల్లడించారు. పూరీ దేవాలయాన్ని తిరిగి తెరవాలని భక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతోన్న సమయంలో తాజా విషయం ఆందోళనకు గురిచేస్తోంది. మార్చి నెల నుంచి ఇక్కడ భక్తుల దర్శనాలను నిలిపివేశారు.

‘పూరీ ఆలయంలో ఇప్పటివరకు మొత్తం 404మందికి వైరస్‌ సోకింది. వీరిలో 351మంది సేవకులు ఉండగా, మరో 53మంది సిబ్బంది ఉన్నారు. వైరస్‌ బారినపడిన వారిలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని జగన్నాథ ఆలయ పర్యవేక్షణ అధికారి అజయ్‌ కుమార్‌ జేనా వెల్లడించారు. వైరస్‌ సోకిన వారిలో ఎక్కువగా హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో పూజలు, ఆలయ నిర్వహణకు సిబ్బంది కొరత ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, నిత్యం జరిగే పూజలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని ఆలయ పర్యవేక్షణాధికారి స్పష్టంచేశారు.

పూరీ రథయాత్ర అనంతరం 822 మంది ఆలయ సిబ్బందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపించగా కేవలం ఇద్దరికి మాత్రమే వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కానీ, తర్వాత ఆలయ సిబ్బందిలో వైరస్‌ విస్తృతంగా వ్యాపించింది. కేవలం ఒక్కనెల వ్యవధిలోనే 400మందికి సోకింది. ఇదే విషయాన్ని ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు నివేదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయంలో భక్తుల సందర్శనకు అనుమతిస్తే మరింత మంది సేవకులు, సిబ్బంది వైరస్‌ బారినపడే అవకాశాలుంటాయని పేర్కొంది. అయితే, వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా.. కరోనా నిబంధనలను సిబ్బంది తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ పర్యవేక్షణ అధికారులు స్పష్టంచేశారు. మరోనెల రోజుల్లో‌ సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పూజల్లో ప్రత్యేకత..!

ఆలయంలో కొలువైన బలభద్ర, సుభద్ర, జగన్నాథ మూర్తులకు నిర్వహించే పూజల్లో నిత్యం 39మంది పూజారులు పాల్గొంటారు. ఒక్కో మూర్తికి 13మంది చొప్పున పూజారులు వీటిని నిర్వహిస్తారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, ఒక మూర్తికి పూజలు పూర్తైన తర్వాతనే మరొకరికి నిర్వహిస్తారు. ఒకరికి నిర్వహించకపోతే మరొక మూర్తికి పూజలు ఆగిపోయే సంప్రదాయం ఉందని జగన్నాథ ఆలయంపై పరిశోధనలు చేస్తున్న భాస్కర్‌ మిశ్రా వెల్లడించారు. ఇలా నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ ప్రత్యేక పూజలు కొనసాగుతూనే ఉంటాయి.

ఇదిలా ఉంటే, ఒడిశాలో ఇప్పటివరకు 2లక్షల 11వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 813మంది మృత్యువాతపడ్డారు. పూరీ జిల్లాలోనే దాదాపు 10వేల మంది వైరస్‌ బారినపడ్డారు. కేవలం ఒక్క పూరీ మునిసిపాలిటీలోనే 1255కేసులు నమోదుకాగా 52మంది మృత్యువాతపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు