India Corona: కొత్తగా 2.71 లక్షల కేసులు.. స్వల్పంగా తగ్గిన పాజిటివిటీ రేటు

భారత్‌లో రెండు రోజులుగా కొత్త కొవిడ్‌ కేసుల్లో స్వల్పపాటి పెరుగుదల నమోదవుతోంది. తాజాగా 2,71,202 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న 16.65 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది...

Updated : 16 Jan 2022 10:08 IST

దిల్లీ: భారత్‌లో రెండు రోజులుగా కొత్త కొవిడ్‌ కేసుల్లో స్వల్పపాటి పెరుగుదల నమోదవుతోంది. తాజాగా 2,71,202 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న 16.65 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో 314 మంది మృతి చెందారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు నిన్నటితో పోల్చితే స్వల్పంగా తగ్గి 16.28 శాతానికి చేరింది. వీక్లీ పాజిటివిటీ రేటు 13.69గా నమోదైంది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7743కు చేరుకుంది. నిన్నటి కేసుల(6041)తో పోల్చితే కొత్త కేసుల్లో దాదాపు 28.17 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 15.50 లక్షలు దాటాయి. క్రియాశీల కేసుల రేటు 4.18 శాతానికి చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో 1.38 లక్షలకుపైగా రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 94.51 శాతానికి తగ్గింది.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 65.71 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. 4.71 లక్షల మంది ప్రికాషన్‌ డోసు పొందారు. ఇప్పటి వరకూ మొత్తం 156.79 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని