Air India: కాక్‌పిట్‌లోకి స్నేహితురాలు.. 6 నెలల్లో రెండో ఘటన

ఎయిరిండియా (Air India) విమానంలో పైలట్లు తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించారు. భద్రతా పరంగా అత్యంత క్లిష్టమైన లేహ్‌ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దుమారం రేపుతోంది.

Published : 13 Jun 2023 15:38 IST

దిల్లీ: ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలతో ఇటీవల తరచూ వార్తల్లోకెక్కిన ఎయిరిండియా (Air India).. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సంస్థకు చెందిన ఓ విమానంలో పైలట్లు ప్రయాణ సమయంలో తమ స్నేహితురాలిని కాక్‌పిట్‌ (Cockpit)లోకి ఆహ్వానించారు. దిల్లీ-లేహ్‌ విమానంలో (Delhi - Leh Flight) గతవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. కాక్‌పిట్‌లోకి ఇలా ప్రయాణికులను ఆహ్వానించడం ఎయిరిండియా గత ఆరు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

గతవారం దిల్లీ నుంచి లేహ్‌ (లద్దాఖ్‌) వెళ్లిన ఎయిరిండియా ఏఐ-445 విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విమాన ప్రయాణికుల్లో ఒకరు పైలట్‌, కో-పైలట్‌కు స్నేహితురాలు. దీంతో విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి నిబంధనలకు విరుద్ధంగా ఆమెను కాక్‌పిట్‌లోకి ఆహ్వానించారు. అయితే ఆమె ఎంతసేపు అక్కడ కూర్చుందో తెలియదు గానీ.. క్యాబిన్‌ సిబ్బంది ఫిర్యాదుతో ఈ ఘటన బయటికొచ్చింది. దీంతో ఎయిరిండియా (Air India) కఠిన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పైలట్‌, కో-పైలట్‌ను విధుల నుంచి పక్కనబెట్టిన ఎయిరిండియా.. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఎయిర్‌లైన్‌ అధికారిక వర్గాల సమాచారం. అయితే దీనిపై ఎయిరిండియా నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

మరోవైపు, దీనిపై డీజీసీఏ (DGCA) స్పందించింది. ‘‘ఈ ఘటన మా దృష్టికి వచ్చింది. దీనిపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నాం’’ అని వెల్లడించింది. కాగా.. దేశంలోనే లేహ్‌ వైమానిక మార్గం అత్యంత క్లిష్టమైనది. ఈ మార్గంలో ప్రయాణించే విమానంలో పైలట్లు నిబంధనలను ఉల్లంఘించడం భద్రతాపరంగా ప్రమాదకర చర్య అని వైమానిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.

కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఓ ఎయిరిండియా (Air India) విమానంలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. దుబాయి నుంచి దిల్లీ వచ్చిన విమానంలో పైలట్‌ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించడమే గాక.. దాదాపు మూడు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. అంతేగాక.. ఆమెకు సకల మర్యాదలు చేయాలని, భోజనం కూడా ఏర్పాటు చేయాలని విమాన సిబ్బందిని ఆదేశించాడు. ఈ ఘటనపై క్యాబిన్‌ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. ఆ పైలట్‌పై సస్పెన్షన్‌ విధించింది. తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు గానూ.. ఎయిరిండియాకు రూ.30లక్షల జరిమానా కూడా విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని