Air India: బాత్‌రూం డోర్‌ పగలగొట్టి.. సిబ్బందిపై దాడి చేసి.. విమానంలో ఓ ప్రయాణికుడి వీరంగం..!

ఎయిరిండియా విమానంలో (Air India) ఓ విదేశీ ప్రయాణికుడు వీరంగం చేశాడు. విమానం గాల్లో ఉన్న సమయంలో సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు.

Published : 12 Jul 2023 19:37 IST

దిల్లీ: విమానాల్లో కొందరు ప్రయాణికులు ప్రవర్తిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఎయిరిండియా విమానంలో (Air India) ఓ విదేశీ ప్రయాణికుడు వీరంగం చేశాడు. విమానం గాల్లో ఉన్న సమయంలోనే సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా విమానం టాయిలెట్‌ తలుపునూ పగలగొట్టి గందరగోళం సృష్టించాడు. టొరంటో నుంచి దిల్లీ వస్తోన్న ఎయిరిండియా విమానంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. సదరు ప్రయాణికుడిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

క్యాబిన్‌ సూపర్‌వైజర్‌ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘నేపాల్‌కు చెందిన మహేశ్‌ సింగ్‌ పండిత్‌ అనే ప్రయాణికుడు జులై 8న కెనడా నుంచి భారత్‌కు (Toronto to Delhi) ఎయిరిండియా విమానం ఏఐ188లో బయలుదేరాడు. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సమయానికే తనకు కేటాయించిన సీటులో కాకుండా పక్క సీటులో కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా టాయిలెట్‌లో ధూమపానం చేయడంతోపాటు ఆ తలుపును పగలగొట్టాడు. వారించిన విమాన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై ఎదురుదాడికి దిగాడు. దీంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎంత హెచ్చరించినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు మరికొందరి ప్రయాణికుల సహాయంతో అతడిని సీట్లో బలవంతంగా కూర్చోబెట్టాం’ అని పేర్కొన్నారు.

విమానం (Air India) దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA)కు తెలియజేశామని ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇదిలాఉంటే, జూన్‌ 24న ముంబయి నుంచి దిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలోనూ ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని