Rahul Gandhi: ‘చరిత్ర తెలియక.. దాన్ని తిరగరాస్తున్నారు’: అమిత్ షాకు రాహుల్‌ కౌంటర్‌

Rahul Gandhi: దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కౌంటర్‌ ఇచ్చారు. చరిత్ర తెలియకుండానే ఆయన దాన్ని పదే పదే తిరగరాస్తున్నారని దుయ్యబట్టారు.

Published : 12 Dec 2023 14:50 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు సంబంధించి రెండు కీలక బిల్లులను రాజ్యసభ సోమవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. గత కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేవలం ఒకేవ్యక్తి పొరపాటు వల్ల భారత్‌లో జమ్మూకశ్మీర్‌ భాగం కావడం ఆలస్యమైందంటూ పరోక్షంగా జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru)ను ఉద్దేశించి అన్నారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ (Congress) పార్టీ భగ్గుమంది.

దీనిపై తాజాగా హస్తం పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. మంగళవారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ఆయన.. అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘పండిత్‌ నెహ్రూజీ తన జీవితాన్ని ఈ దేశానికి అంకితమిచ్చారు. దేశ ప్రజల కోసం ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. అమిత్‌జీకి చరిత్ర తెలియదు. అందుకే పదే పదే దాన్ని తిరగరాస్తూనే ఉన్నారు’’ అని రాహుల్‌ దుయ్యబట్టారు.

ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు.. ఉద్యోగులకు కేంద్రం కొత్త రూల్స్‌

దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే భాజపా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. ‘‘కుల గణన, నిరుద్యోగం, దేశంలోని ధనమంతా ఎవరి చేతుల్లో ఉంది.. ఇవన్నీ ప్రధాన అంశాలు. వీటిపై చర్చించేందుకు భాజపా భయపడుతోంది. అందుకే వీటి నుంచి పారిపోతోంది’’ అని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును, జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లును రాజ్యసభ సోమవారం దాదాపు నాలుగు గంటల చర్చ తర్వాత ఆమోదించింది. ఈ రెండింటినీ లోక్‌సభ గత వారమే ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. కశ్మీరీ శరణార్థుల నుంచి ఇద్దరిని, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నిర్వాసితుల నుంచి ఒకరిని శాసనసభకు నామినేట్‌ చేసేందుకు, కొన్ని వర్గాలకు రిజర్వేషన్‌ ఇచ్చేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు