Navneet Rana: ఎంపీ నవనీత్‌ రాణాకు వాట్సప్‌లో బెదిరింపులు

అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌ రాణాకు వాట్సప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. ఆమెను చంపేస్తామని బెదిరిస్తూ సందేశం పంపినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published : 06 Mar 2024 16:19 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లోని అమరావతి లోక్‌సభ స్వతంత్ర ఎంపీ, సినీనటి నవనీత్‌ రాణా (Navneet Rana)కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆమెను చంపేస్తామంటూ వాట్సప్‌(Whatsapp)లో ఆడియో సందేశం రావడంపై వ్యక్తిగత సహాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ మెసేజ్‌ పంపిన వ్యక్తులు ఆమెపై అభ్యంతరకర పదజాలం వాడినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

‘‘నవనీత్‌ రాణా ఫోన్‌కు మార్చి 3న బెదిరింపు మెసేజ్‌ రావడంతో ఆమె వ్యక్తిగత సహాయకుడు వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం’’ అని పోలీసులు తెలిపారు. ఆమెకు పంపిన ఆడియో క్లిప్‌లో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌లపైనా అభ్యంతరకర పదాలు ఉపయోగించినట్లు సమాచారం.  దీంతో ఎంపీ నవ్‌నీత్‌ రాణా పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. 

గత లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి సీటు నుంచి శివసేన నేత ఆనందరావు అడ్సుల్‌పై సినీనటి నవనీత్‌ రాణా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ ముందు హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తామని నవనీత్‌ రాణాతోపాటు ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు పిలుపునివ్వడం ద్వారా మహారాష్ట్రలో రాజకీయ తుపానుకు కేంద్ర బిందువుగా మారారు. ఈ దంపతుల చర్యలు అప్పట్లో శివసేన శ్రేణుల ఆగ్రహానికి గురయ్యాయి. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దంపతులిద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించగా ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి సీటు నుంచి మళ్లీ పోటీ చేసేందుకు నవనీత్‌ రాణా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని