Anand Mahindra: రోడ్‌వే కిట్‌తో క్షణాల్లో రహదారి నిర్మాణం.. వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా

అత్యవసర సమయాల్లో రహదారి నిర్మాణం కోసం రూపొందించిన రోడ్‌వే కిట్‌కు సంబంధించిన వీడియోను ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేశారు. 

Published : 16 Jan 2024 17:10 IST

ముంబయి: రహదారులు సరిగా లేని మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో క్షణాల్లో తాత్కాలిక రోడ్డు నిర్మాణం కోసం రూపొందించిన రోడ్‌వే కిట్‌ ఎంతో అద్భుతంగా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) అన్నారు. దీంతో యుద్ధాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైనిక వాహనాలు, సహాయక సామగ్రిని సులువుగా తరలించవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో షేర్‌ చేశారు. ‘‘ఇది ఎంతో అద్భుతంగా ఉంది. రహదారి లేని మైదాన ప్రాంతాల్లో దీని సాయంతో మన సైన్యం సులువుగా ఆయుధ సామగ్రిని, వాహనాలను తరలించవచ్చు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక బృందాలకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు. 

ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో అల్యూమినియంతో రూపొందించిన వెడల్పాటి పెద్ద చైన్‌ను క్రేన్‌ సాయంతో నేలపై పరుస్తుండటం చూడొచ్చు. మంచు, ఇసుకతో కప్పబడిన ప్రాంతాలు, నది మధ్యలో దీని ద్వారా రోడ్డు నిర్మాణం క్షణాల్లో పూర్తి చేయొచ్చని కంపెనీ చెబుతోంది. రోడ్‌వే కిట్‌తో అవసరం తీరిన తర్వాత తిరిగి దానిని యంత్రం సాయంతో చుట్టేసి వెంట తీసుకెళ్లిపోవచ్చని సంస్థ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని