Stubble Burning: ‘నీళ్లు అడిగాం.. పొగ కాదు!’ ఆప్‌ ప్రభుత్వంపై విసుర్లు

తాము పంజాబ్‌ నుంచి నీళ్లు అడిగామని.. పంట వ్యర్థాల పొగ కాదంటూ హరియాణా మంత్రి జైప్రకాశ్‌ వ్యాఖ్యానించారు.

Published : 04 Nov 2023 18:02 IST

చండీగఢ్‌: దేశ రాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాల్లో (Delhi NCR) వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. పంట వ్యర్థాలను తగులబెట్టడం (Stubble Burning) వంటి ఘటనలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. అయితే, ఈ వ్యవహారం కాస్త ఆయా రాష్ట్రాల మధ్య వాదోపవాదాలకు కారణమవుతోంది. తాము పంజాబ్‌ నుంచి నీళ్లు అడిగామని.. పంట వ్యర్థాల పొగ కాదంటూ హరియాణా మంత్రి జైప్రకాశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్టు పెట్టారు. మరోవైపు.. ఆప్‌ (AAP) నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

గత మూడు రోజుల్లో పంజాబ్‌తో పోలిస్తే తమ రాష్ట్రంలోనే అతి తక్కువ పంట వ్యర్థాల దహనం ఘటనలు నమోదైనట్లు హరియాణా వ్యవసాయ మంత్రి జైప్రకాశ్‌ తెలిపారు. ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ల నుంచి తాము నీళ్లను అడిగామని, పంట వ్యర్థాల పొగ కాదని పేర్కొన్నారు. మంత్రి ఉటంకించిన వివరాల ప్రకారం.. నవంబరు 1, 2, 3వ తేదీల్లో పంజాబ్‌లో మొత్తంగా 5140 పంట వ్యర్థాల దహనం ఘటనలు నమోదు కాగా, హరియాణాలో కేవలం 175గా ఉన్నాయి. అయితే, మంత్రి జైప్రకాశ్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆప్‌ ఆరోపించింది.

దిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు..

దేశంలోని 52 అత్యంత కాలుష్యభరిత జిల్లాల్లో 20 హరియాణాలోనే ఉన్నాయని, అయినప్పటికీ మనోహర్‌ లాల్‌ ఖట్టర్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై రాజకీయాలు చేస్తూ.. పంజాబ్‌పై నిందలు వేస్తోందని ఆప్‌ పంజాబ్ ప్రతినిధి నీల్ గార్గ్ విమర్శించారు. పంట వ్యర్థాల దహనం ఘటనలను తగ్గించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం రైతులకు యంత్రాలను అందించిందని, హరియాణా ప్రభుత్వం మాత్రం కేవలం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. దిల్లీ కొన్ని రోజులుగా వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504కి చేరింది. ఈ సీజనులో ఈ స్థాయిలో కాలుష్య తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. దిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిమితుల కంటే 80 రెట్లు ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ప్రభుత్వం కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని