మనుషులు లేని చోట బ్యాంక్‌ అట!

బ్యాంక్‌.. ప్రజలకు నిత్యవసరాల్లో ఒకటిగా మారిన వ్యవస్థ. వ్యాపారాలకు సంబంధించిన నగదు లావాదేవీలు, జీతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజలకు ఇచ్చే నగదు అన్నీ బ్యాంకుల ద్వారానే సాగుతుంటాయి. అందుకే ప్రజలకు అందుబాటులో

Updated : 28 Aug 2020 20:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్‌.. ప్రజలకు నిత్యవసరాల్లో ఒకటిగా మారిన వ్యవస్థ. వ్యాపారాలకు సంబంధించిన నగదు లావాదేవీలు, జీతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజలకు ఇచ్చే నగదు అన్నీ బ్యాంకుల ద్వారానే సాగుతుంటాయి. అందుకే ప్రజలకు అందుబాటులో ఉండాలని బ్యాంకులు తమ బ్రాంచ్‌లను జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తుంటాయి. కానీ, మెక్సికోలోని ఓ బ్యాంక్‌ మాత్రం సిటీకి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ బ్రాంచ్‌ ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అయితే, అటు ఇటు పోయి.. ఈ విషయంలో ఆ దేశాధ్యక్షుడు ఆండ్రూస్‌ మాన్యూవల్‌ లోపెజ్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ అసలు ఆ బ్యాంక్‌ను అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు? అధ్యక్షుడిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి?

బాంకో డెల్‌ బెయిన్‌స్టార్‌కి మెక్సికోలో ప్రముఖ బ్యాంక్‌గా పేరుంది. దేశాధ్యక్షుడి సూచన మేరకు ఈ బ్యాంక్‌ గతేడాది ఏర్పాటు చేశారు. దీని ద్వారానే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతుంటాయి. అయితే, ఈ బ్యాంక్‌ ఇటీవల చిహువాహువా నగర ప్రజల కోసం ఓ బ్రాంచ్‌ ఏర్పాటు చేయలనుకుంది. ఈ మేరకు నగరానికి కొంచెం దూరంలో మనుషులు లేని ఎడారిలాంటి ప్రాంతంలో ఒక భవంతిని నిర్మించి బ్రాంచ్‌ ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్‌లో ఈ బ్రాంచ్‌ను ప్రారంభించనున్నారట. చిహువాహువా నగరంలోని లబ్ధిదారులు, వ్యాపారాలు నగదు లావాదేవీల కోసం ఎటువంటి రవాణా సౌకర్యం, సరైన రోడ్డు మార్గంలేని ఈ బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుందట. దీంతో ఈ బ్రాంచ్‌ ఏర్పాటుపై నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మనుషులే లేని చోట బ్యాంక్‌ ఏమిటని, బ్యాంక్‌ను చేరుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడాలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ బ్రాంచ్‌ని నిర్మిస్తూ దేశాధ్యక్షుడు ప్రజల డబ్బును వృథా చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. డబ్బులు ఆదా చేయడానికి ఆయన తీసుకొచ్చిన ‘ఫోర్త్‌ ట్రాన్స్‌ఫార్మెషన్‌’కు విరుద్ధంగా ఈ చర్య ఉందని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో బ్రాంచ్‌ ఏర్పాటుపై బ్యాంక్‌ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. తాము మొదట నగరంలోని నియోవొ కేసస్‌ గ్రాండీస్‌ మున్సిపాలిటీలో బ్రాంచ్‌ ఏర్పాటు చేయాలని భావించారట. అయితే, స్థానిక మేయర్‌ వారికి బ్రాంచ్‌ ఏర్పాటుకు స్థలం ఇవ్వడానికి నిరాకరించారట. దీంతో మెక్సికన్‌ ఆర్మీకి చెందిన స్థలాన్ని బ్యాంక్‌కు కేటాయించడంతో ఈ నిర్మానుష్య ప్రాంతంలో బ్రాంచ్‌ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రజలు బ్యాంక్‌కి రావడానికి మార్గం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని