Joe Biden: బై బై భారత్‌.. వియత్నాం బయల్దేరిన బైడెన్‌..!

జోబైడెన్‌ వియత్నాం బయల్దేరి వెళ్లిపోయారు. నిన్న రాత్రి ఆయన కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకొన్నాయి. 

Updated : 10 Sep 2023 14:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) జీ20 సదస్సు(g20 summit 2023)ను ముగించుకొని వియత్నాం బయల్దేరి వెళ్లారు. ఆయన ఆదివారం ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకొన్నారు. అక్కడి నుంచి తన ఎయిర్‌ ఫోర్స్‌వన్‌ విమానంలో బయల్దేరి వెళ్లారు. బైడెన్‌ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌లో తొలిసారి పర్యటించారు. శుక్రవారం మొదలైన ఆయన పర్యటనలో తొలి రోజు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తాజాగా వియత్నాం పర్యటనలో కూడా ఆయన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఎక్కువ దృష్టి సారించనున్నారు. ఆది, సోమవారాలు ఆయన అక్కడే ఉంటారు. అక్కడి కార్యకలాపాల్లో కూడా ఆయన మాస్క్‌ ధరించే పాల్గొననున్నారు. 

భద్రతా దళాల అదుపులో బైడెన్‌ కాన్వాయ్‌లోని డ్రైవర్‌ 

బైడెన్‌ కాన్వాయ్‌లో ఓ డ్రైవర్‌ను శనివారం రాత్రి భద్రతా దళాలు అదుపులోకి తీసుకొన్నాయి. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని దళాలు ప్రశ్నించాయి. బైడెన్‌ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు అమెరికా నుంచి రాగా.. మరికొన్నింటిని భారత్‌లోనే కేటాయించారు. వీటిల్లో అద్దెకు తీసుకొన్న కారు ఒకటి ఉంది.

200 గంటలు.. 300 సమావేశాలు.. 15 ముసాయిదాలు.. దిల్లీ డిక్లరేషన్‌ వెనుక భారీ కసరత్తు

బైడెన్‌ బసచేసే హోటల్‌ ఐటీసీ మౌర్యా వద్ద అది ఉండాల్సి ఉండగా.. యూఏఈ పాలకుడు అల్‌ నహ్యాన్‌ బస చేస్తున్న తాజ్‌ హోటల్‌ వద్ద అది కనిపించింది. ఓ వ్యాపారవేత్తను అక్కడ డ్రాప్‌ చేసేందుకు తాను వచ్చానని సదరు డ్రైవర్‌ అధికారులకు చెప్పాడు. ప్రొటోకాల్‌ గురించి తనకు తెలియదన్నాడు. కొన్ని గంటలు ప్రశ్నించిన తర్వాత సంతృప్తి చెందిన భద్రతా దళాలు అతడిని వదిలిపెట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని