Bilkis Bano: గోధ్రా సబ్‌ జైలులో లొంగిపోయిన బిల్కిస్‌ బానో కేసు దోషులు

బిల్కిస్‌ బానో కేసు దోషులు ఆదివారం రాత్రి గోధ్రా సబ్‌ జైలులో లొంగిపోయారు. 

Updated : 22 Jan 2024 01:37 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో (Bilkis Bano) కేసులో 11 మంది దోషులు ఆదివారం రాత్రి గుజరాత్‌లోని గోధ్రా సబ్‌జైలులో లొంగిపోయారు. తమకు కొన్ని బాధ్యతలున్నాయని, లొంగిపోయేందుకు మరింత సమయం ఇవ్వాలంటూ వారు ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే వారి పిటిషన్లను తోసిపుచ్చుతూ ఆదివారం నాటికి లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం వారికి డెడ్‌లైన్‌ విధించింది. దీంతో ఆదివారం రాత్రి 11 మంది దోషులు జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. 

2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న మతపరమైన అల్లర్లలో బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. 5 నెలల గర్భవతిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వారికి 2022లో గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌(శిక్ష తగ్గింపు) మంజూరు చేసింది. దీంతో 2022 ఆగస్టు 15న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బానో సుప్రీం తలుపుతట్టారు. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.. వారి విడుదల చెల్లదని ఈ నెల 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండు వారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని