Vaccine: కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌కు బూస్టర్‌డోసుగా కార్బివాక్స్‌..!

కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

Updated : 13 Oct 2021 15:17 IST

ప్రయోగాలకు అనుమతి కోరిన బయోలాజికల్‌ - ఇ

దిల్లీ: కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అటు డబ్ల్యూహెచ్‌వో కూడా బూస్టర్ డోసు తీసుకోవడమే మంచిదని సూత్రప్రాయంగా తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ బయోలాజికల్‌ - ఇ.. తాము అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్‌ టీకాను బూస్టర్‌ డోసు కింద పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నవారికి కార్బివాక్స్‌ను బూస్టర్‌డోసుగా ఇచ్చేలా మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

ప్రస్తుతం కార్బివాక్స్‌ టీకా రెండు, మూడు దశల క్లినికల్‌ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 18 నుంచి 80ఏళ్ల లోపు వారిపై ఈ పరీక్షలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులో ఆ ప్రయోగాల ఫలితాలను కంపెనీ వెల్లడించనుంది. ఈ టీకాకు ఇంకా డీసీజీఐ అనుమతులు రాకముందే.. కేంద్ర ప్రభుత్వం 30కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.1500కోట్లు చెల్లించింది కూడా.

ఇలాంటి సమయంలో బూస్టర్‌ డోసు ప్రయోగాల కోసం బయోలాజికల్‌ - ఇ డీసీజీఐ అనుమతి కోరింది. ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ టీకా తీసుకున్నవారికి కార్బివాక్స్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చి మూడో దశ ప్రయోగాలు చేపట్టాలని భావిస్తోంది. ‘‘టీకా తీసుకున్న కొన్ని నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుతున్నాయని ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో చాలా దేశాలు బూస్టర్‌డోసుపై దృష్టిపెట్టాయి. కొన్ని దేశాలు ఇప్పటికే పంపిణీ కూడా ప్రారంభించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేం కూడా ఈ దిశగా ప్రయోగాలు చేపట్టాలనుకుంటున్నాం. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండు డోసులు పూర్తయి, కొవిడ్‌ నెగెటివ్‌ ఉన్న వాలంటీర్లపై ఈ ప్రయోగాలు జరపాలనుకుంటున్నాం’’ అని బయోలాజికల్‌ - ఇ వెల్లడించింది. దీనిపై నిపుణుల కమిటీ తమ తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని