Bombay HC: సోషల్‌ మీడియా సమాచారంతో ‘పిల్‌’.. తప్పుపట్టిన బాంబే హైకోర్టు!

ఓ పిల్‌లో పిటిషన్‌దారు సోషల్‌ మీడియా నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రస్తావించడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది.

Published : 28 Nov 2023 17:48 IST

ముంబయి: ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)లో సామాజిక మాధ్యమాల (Social Media) నుంచి సేకరించిన సమాచారాన్ని ఉటంకించడాన్ని బాంబే హైకోర్టు (Bombay High Court) తప్పుపట్టింది. పిటిషన్‌దారు బాధ్యతారాహిత్యంగా ఉండకూడదని హితవు పలికింది. మహారాష్ట్రలో జలపాతాలు, నీటివనరుల వద్ద ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, భద్రతా చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ వ్యాజ్యాన్ని విచారించేందుకు నిరాకరిస్తూ.. ఈ విధంగా వ్యాఖ్యానించింది. చాలావరకు ప్రమాదాలు నిర్లక్ష్యపూరిత చర్యల వల్లే జరుగుతున్నాయని పేర్కొంది.

సరైన భద్రతా చర్యలు లేని జలపాతాలు, నీటివనరుల వద్ద ఏటా 1500 నుంచి 2000 మంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ ఓ పిటిషన్‌దారు బాంబే హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ ఆరిఫ్‌ డాక్టర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ పిల్‌ను పరిశీలించింది. మరణాలపై సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? అని పిటిషన్‌దారు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. కొన్ని వార్తాపత్రికలతోపాటు సామాజిక మాధ్యమాల్లోని పోస్టుల నుంచి సేకరించినట్లు చెప్పారు. దీన్ని బెంచ్‌ తప్పుపట్టింది. సోషల్ మీడియా నుంచి సేకరించిన సమాచారం.. ప్రజాప్రయోజన వ్యాజ్యంలో భాగం కాకూడదని జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ స్పష్టం చేశారు.

కలెక్టర్లకు ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం: మద్రాసు హైకోర్టు

‘ఎవరో విహారయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతారు. ఆర్టికల్ 14, 21ల కింద ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుంది? చాలా ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. ప్రతి జలపాతాన్ని పోలీసులు నిర్వహించగలరా? ఏది ప్రమాదకర జలపాతం.. ఏది కాదనేది ఆరా తీశారా?’ అంటూ న్యాయవాదిపై బెంచ్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. ‘వ్యాజ్యం అస్పష్టంగా ఉంది. పిల్‌ దాఖలు చేసేటప్పుడు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. అందుకే ఈ తరహా పిటిషన్లను విచారించలేం’ అని స్పష్టం చేసింది. సరైన వివరాలతో మళ్లీ రావాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని