Bengaluru: ఏప్రిల్‌ నాటికి 1,400 ఎలక్ట్రిక్‌ బస్సులు: సిద్ధరామయ్య

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి బీఎంటీసీకి మరో 1400 ఎలక్ట్రిక్‌ బస్సుల్ని సమకూర్చనున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై భాజపా విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Published : 26 Dec 2023 17:41 IST

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ (BMTC)కు త్వరలోనే భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చనున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తెలిపారు.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి మొత్తం 1400 కొత్త బస్సులను బీఎంటీసీకి ఇవ్వనున్నట్లు తెలిపారు.  తొలి దశలో భాగంగా మంగళవారం 100 నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులకు విధాన సౌధ వద్ద  పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘శక్తి’ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 120 కోట్ల రైడ్‌లు ఉచితంగా చేశారన్నారు. మొత్తంగా బెంగళూరులో ప్రతి రోజూ 40లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులతో ప్రజా రవాణాను ప్రోత్సహించడంతో పాటు నగరంలో పెరుగుతోన్న వాహన కాలుష్యాన్ని నియంత్రించవచ్చని సీఎం తెలిపారు.

ఉచిత ప్రయాణంపై భాజపా విమర్శలకు కౌంటర్‌

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సేవలపై భాజపా విమర్శలు చేస్తోందని.. మరి, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న గ్యారంటీలతో ప్రజల కొనుగోలు శక్తితో పాటు ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయన్నారు. కార్మికులు, రైతులు, మహిళల డబ్బు చాలా వరకు ఆదా అవ్వడం ద్వారా లక్షలాది కుటుంబాల ఆర్థిక శక్తి పెరుగుతోందని వివరించారు. తమ ప్రభుత్వం అమలుచేస్తోన్న గ్యారంటీ పథకాల ద్వారా రాష్ట్రంలో 4.30 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లబ్దిపొందుతున్నారని సీఎం తెలిపారు. గత భాజపా హయాంలో ప్రజల సాధికారత కోసం చేసిందేమీ లేదని.. పైగా ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారంటూ సీఎం ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు