Delhi: సుప్రీం తీర్పును ఆర్డినెన్స్‌తో అడ్డుకుంటారా?: కేజ్రీవాల్‌

దిల్లీలో (Delhi) ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్‌ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు.

Updated : 20 May 2023 22:26 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రాణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆర్డినెన్స్‌ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. అందుకే సర్వోన్నత న్యాయస్థానానికి మే 18 నుంచి వేసవి సెలవులు ఉన్నట్లు తెలుసుకొని, ఒక్క రోజు తర్వాత  ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, అప్రజాస్వామికమని మండిపడ్డారు. దీనిపై మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్‌ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి దిల్లీ ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో కేంద్రం స్పష్టం చేసింది.

అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గతంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా ఉందని దిల్లీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు పరచాల్సిందేని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు పలువురు మంత్రులు గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకురావడంతో రాష్ట్ర అధికారాలకు గండిపడే అవకాశమున్నందున దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని