Shashi Tharoor: శశిథరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రెంచ్‌ సెనేట్‌ అధ్యక్షుడు జెరార్డ్‌ లార్చర్‌ ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Published : 21 Feb 2024 00:05 IST

దిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు (Shashi Tharoor) ఫ్రాన్స్‌ అత్యున్నత పౌరపురస్కారం ‘ చెవాలియర్‌ డె లా లీజియన్‌ డి హానర్’ వరించింది. దిల్లీలోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రెంచ్‌ సెనేట్‌ అధ్యక్షుడు జెరార్డ్‌ లార్చర్‌ ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆగస్టు 2022లో ఫ్రాన్స్‌ ప్రభుత్వం థరూర్‌కు ఈ అవార్డును ప్రకటించగా.. తాజాగా దానిని అందజేశారు. భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య సంబంధాల బలోపేతం, అంతర్జాతీయ సహకారం, శాంతిస్థాపనకు థరూర్‌ చేసిన అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ఈ పుస్కారాన్ని ప్రదానం చేసినట్లు ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 

ఈ సందర్భంగా జెరార్డ్‌ లార్చర్‌ మాట్లాడుతూ.. దౌత్యవేత్తగా, రచయితగా, రాజకీయవేత్తగా శశిథరూర్‌ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఫ్రాన్స్‌కు ఆయన నిజమైన స్నేహితుడని, ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ పురస్కారం ఆయనపై ఫ్రాన్స్‌కు ఉన్న స్నేహాన్ని, ప్రేమను సూచిస్తుందని, ప్రపంచ దేశాల అభివృద్ధిపట్ల ఆయన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, తన బాధ్యతను ఇది మరింత పెంచిందని శశిథరూర్‌ పేర్కొన్నారు. ‘‘ ఫ్రాన్స్‌ ప్రజల భాష, సంస్కృతి, సాహిత్యాలను మెచ్చుకునే వ్యక్తిగా, మీ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కినందుకు ఎంతో గర్వపడుతున్నా’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని