World Bank: 2050 నాటికి 21.6 కోట్ల మంది వలస!

వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లోని దాదాపు 21.6 కోట్ల మంది అంతర్గత వలసలకు వెళ్తారని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. అత్యధికంగా సబ్‌ సహారన్‌ ఆఫ్రికా రీజియన్‌లో 8.6 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళతారని పేర్కొంది. 

Published : 13 Sep 2021 23:55 IST

ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడి

వాషింగ్టన్‌: వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లోని దాదాపు 21.6 కోట్ల మంది అంతర్గత వలసలకు వెళ్తారని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. అత్యధికంగా సబ్‌ సహారన్‌ ఆఫ్రికా రీజియన్‌లో 8.6 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళతారని పేర్కొంది. తూర్పు ఆసియా- పసిఫిక్‌ రీజియన్‌లో 4.9 కోట్లు, దక్షిణాసియాలో నాలుగు కోట్లు, ఉత్తర ఆఫ్రికాలో 1.9 కోట్లు, లాటిన్‌ అమెరికాలో 1.7 కోట్లు, తూర్పు ఐరోపా- మధ్య ఆసియాలో 50 లక్షల మంది వలస వెళ్తారని చెప్పింది. ఈ ప్రక్రియ 2030 నుంచి మొదలై.. 2050 నాటికి తీవ్రం రూపం దాలుస్తుందని తెలిపింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించడం, పచ్చదనాన్ని పెంపొందించడం తదితర చర్యలు వెంటనే చేపడితే దీన్ని 80 శాతం వరకు నిరోధించగలమని సూచించింది. 

నష్టాలను గుర్తు చేస్తుంది..

వాతావరణ మార్పులు అంతర్గత వలసలకు ముఖ్య కారణం. ప్రజల జీవనం, ఉపాధిపై ఇవి ప్రభావం చూపుతాయి. నీటి కొరత, పంట ఉత్పాదకత క్షీణించడం, సముద్ర మట్టాలు పెరగడం తదితరాలు వాతావరణ మార్పుల దుష్ప్రరిణామాలకు ఉదాహరణలు. ‘ఈ నివేదిక.. వాతావరణ మార్పుల కారణంగా మనుషులకు కలిగే నష్టాలను గుర్తు చేస్తోంది. దీంతోపాటు వలసలకు కారణమయ్యే సమస్యలను గుర్తించడానికి, పరిష్కరించడానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంద’ని ప్రపంచ బ్యాంకు సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జ్యుర్గెన్‌ వోగెల్‌ తెలిపారు. పరిష్కార మార్గాలకు చొరవ చూపే దేశాలకు సంస్థ తరఫున మద్దతు ఇస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు