Defence: ‘రక్షణ’ తయారీలో భారత్‌ రికార్డు.. తొలిసారి రూ.లక్ష కోట్లు దాటిన ఉత్పత్తి!

రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌ రికార్డు సృష్టించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లకుపైగా విలువైన రక్షణ ఉత్పత్తులను తయారు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లను దాటడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం.

Published : 19 May 2023 14:35 IST

దిల్లీ: రక్షణ ఉత్పత్తుల తయారీ (Defence Production)లో భారత్‌ రికార్డు సృష్టించింది. తొలిసారిగా 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లకుపైగా విలువైన రక్షణ ఉత్పత్తులను తయారు చేసింది. ప్రస్తుతం ఉత్పత్తుల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉండగా.. ఇంకా మరికొన్ని ప్రయివేటు రక్షణ సంస్థల నుంచి డేటా వస్తే మరింత పెరుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. స్వావలంబనే లక్ష్యంగా.. రక్షణ శాఖ (Defence Ministry) స్థిరమైన ప్రయత్నాలతో ఈ రికార్డు సాధ్యమైందని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రక్షణ ఉత్పత్తుల విలువ.. 2021-22లోని రూ.95 వేల కోట్లతో పోలిస్తే 12 శాతానికిపైగా అధికం కావడం విశేషం. రక్షణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, వాటికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు తమ శాఖ నిరంతరం పని చేస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏకీకరణతో సహా రక్షణ రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కేంద్రం పలు సంస్కరణలు ప్రవేశపెట్టింది. దీంతోపాటు గత 7-8 ఏళ్లలో ప్రభుత్వం ద్వారా పరిశ్రమలకు జారీ అయిన రక్షణ లైసెన్సుల సంఖ్యలో దాదాపు 200 శాతం పెరుగుదల ఉంది. ఈ చర్యలు దేశంలోని రక్షణ పారిశ్రామిక ఉత్పాదక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందించాయి. ఉపాధి అవకాశాలను సృష్టించాయి’ అని కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని