NEET racket: ‘రూ.7 లక్షలిస్తే నీట్‌ పరీక్ష రాసిపెడతాం..’: దిల్లీ ఎయిమ్స్‌ విద్యార్థుల ఘరానా మోసం

దిల్లీ ఎయిమ్స్‌ విద్యార్థుల ఘరానా మోసాన్ని (NEET racket) పోలీసులు ఛేదించారు. నీట్‌ పరీక్షలో అభ్యర్థుల స్థానంలో వీరు పరీక్ష రాసినట్లు తేలింది. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి వారు రూ.7లక్షలు వసూలు చేశారట..!

Published : 04 Jul 2023 12:59 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్షలో భారీ మోసం (NEET racket)బయటపడింది. నీట్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు అసలైన అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో ఓ ముఠా పరీక్ష (NEET Exam) రాయిస్తోంది. దేశ రాజధాని దిల్లీలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్‌ (Delhi AIIMS) విద్యార్థులు నడిపిస్తున్న ఈ ‘నీట్‌ రాకెట్‌’ను దిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ ముఠా నాయకుడు సహా ఇప్పటివరకు నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు.

దిల్లీ ఎయిమ్స్‌లో రేడియాలజీ రెండో సంవత్సరం చదువుతున్న నరేశ్ బిష్రోయ్‌ ఈ రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నీట్‌ పరీక్షలో అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేయించి నరేశ్ వారితో పరీక్ష (NEET Exam) రాయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డబ్బులు ఆశజూపి అనేక మంది ఎయిమ్స్‌ విద్యార్థులను నిందితుడు తన గ్యాంగ్‌లో చేర్చుకున్నాడు. ఎక్కువగా ఎయిమ్స్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో నీట్‌ పరీక్ష రాయించేవాడు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ ప్రవేశ పరీక్షలో నరేశ్ గ్యాంగ్‌కు చెందిన పలువురు.. అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాస్తూ అధికారులకు చిక్కారు. ఎయిమ్స్‌లో రేడియాలజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంజూ యాదవ్‌ అనే విద్యార్థి.. వేరే అభ్యర్థి స్థానంలో నీట్‌ పరీక్ష రాస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. అలాగే, మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గల ఓ నీట్‌ పరీక్షా కేంద్రంలో మరో ఇద్దరు విద్యార్థులు మహవీర్‌, జితేంద్ర కూడా ఇలాగే పట్టుబడ్డారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

అనంతరం వారిని విచారించగా.. ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. దీంతో సోమవారం ఈ ముఠా నాయకుడు నరేశ్ బిష్రోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నరేశ్‌ తన రెండో సంవత్సరం పరీక్ష రాస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఒక్కో డీల్‌కు రూ.7లక్షలు..

విచారణలో ఈ గ్యాంగ్‌ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ విద్యార్థులతో ప్రవేశ పరీక్ష రాయించేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7లక్షలతో ఈ గ్యాంగ్‌ డీల్‌ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. తొలుత రూ.లక్ష అడ్వాన్స్‌ తీసుకుని, పరీక్ష రాసిన తర్వాత రూ.6లక్షలు చెల్లించేవారట. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాలో ఇంకా ఎంతమంది విద్యార్థులున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని