Mahua Moitra: మహువాపై ఆరోపణలు.. ఆ వ్యాపారవేత్త అఫిడవిట్ అందింది: ఎథిక్స్‌ కమిటీ

లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) రాజకీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలకు సంబంధించిన అఫిడవిట్‌ తమకు అందిందని పార్లమెంట్‌ ఎథిక్స్ కమిటీ తాజాగా వెల్లడించింది. 

Published : 20 Oct 2023 16:42 IST

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ లక్ష్యంగా పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)కు డబ్బులు చెల్లించినట్లు మరో వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ అఫిడవిట్‌లో దర్శన్‌ ఆ విషయాలను అంగీకరించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ ఆఫిడవిట్‌ తమకు అందినట్లు లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ శుక్రవారం వెల్లడించింది.

‘దర్శన్ హీరానందాని అఫిడవిట్‌ మాకు అందింది. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. భాజపా ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey)చేసిన ఫిర్యాదును ఎథిక్స్ కమిటీ అక్టోబర్ 26 విచారిస్తుంది. ఆ రోజున ఆయన తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలి. మొదట మేం దూబే రాసిన లేఖ, హీరానందాని అఫిడవిట్‌ను పరిశీలిస్తాం. ఆ తర్వాత మొయిత్రా వాదన వింటాం’ అని ఎథిక్స్‌ కమిటీ ఛైర్మన్ వినోద్‌ సోంకార్‌ జాతీయ మీడియాకు వెల్లడించారు.

ఒత్తిడి చేసి, సంతకం చేయించారు: ట్విటర్‌లో మహువా సంచలన ఆరోపణ

ఇదిలా ఉంటే.. తనపై వస్తోన్న ఆరోపణలను మొయిత్రా తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను ఎలాంటి విచారణకు అయినా సిద్ధమేనన్నారు. ఈ లోపు అవాస్తవాలు ప్రచారం కాకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ‘ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ ఒకసారి లోక్‌సభ నిబంధనలను పరిశీలించాలి. ఆ అఫిడవిట్ మీడియాకు ఎలా లీక్‌ అయింది..? ఆ లీక్‌పై ఛైర్మన్‌ మొదట విచారణ చేపట్టాలి. నేను మళ్లీ చెప్పేది ఒకటే మాట. అదానీ అంశంపై మాట్లాడకుండా నన్ను లోక్‌సభ నుంచి బహిష్కరించడమే భాజపా ఏకైక లక్ష్యం’ అని తాజాగా ట్వీట్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని