Farm Laws: సాగు చట్టాల రద్దు.. ఆందోళన విరమణపై శనివారం నిర్ణయం..!

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఉద్యమంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. నూతన చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి

Published : 19 Nov 2021 18:33 IST

దిల్లీ: నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఉద్యమంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. నూతన చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా నేడు వెల్లడించారు. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. దీంతో తదుపరి కార్యాచరణకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాల ప్రతినిధులు శనివారం సమావేశం కానున్నారు. సాగు చట్టాలపై కేంద్రం ప్రకటనతో.. ఆందోళన విరమించాలా లేదా అన్నదానిపై  శనివారం జరిగే భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కనీస మద్దతు ధర అంశంపై చర్చ జరిగే అవకాశముంది. 

ఇదిలా ఉండగా.. సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్ణయాత్మక మండలి మాత్రం ఆదివారం(నవంబరు 21) సమావేశం కానున్నట్లు సమాచారం. ఆందోళన విరమణ, ఎంఎస్‌పీ అంశాలపై ఆ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ మాత్రం ఆందోళన ఇప్పట్లో విరమించేది లేదని చెప్పడం గమనార్హం. రద్దుపై పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ అయిన తర్వాతే రైతులు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్తారని ఆయన కరాఖండీగా చెప్పారు. 

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణా రైతులు గతేడాది నవంబరు చివరి వారం నుంచి దిల్లీ సరిహద్దుల్లో శాంతియుత ఆందోళన సాగిస్తోన్న విషయం తెలిసిందే. సాగు చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. అవి ఫలించలేదు. మరోవైపు రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే చట్టాలపై కోర్టు స్టే కూడా విధించింది. అయినప్పటికీ రైతులు మాత్రం ఆందోళన సాగించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేసేంతవరకు వెనక్కి తగ్గేది లేదంటూ సరిహద్దుల్లోనే ఉన్నారు. దీంతో దిగొచ్చిన కేంద్రం.. సాగు చట్టాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని