Emmanuel Macron: థాంక్యూ మోదీ.. దిల్లీ డిక్లరేషన్‌పై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌

భారత్‌లో జీ20 ఫలితాలపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ మిశ్రమ స్పందనలు వ్యక్తంచేశారు. రష్యాకు ఇదేమీ దౌత్య విజయం కాదని ఆయన పేర్కొన్నారు. పర్యవరణంపై ఈ ఫలితాలు సరిపోవని అభిప్రాయపడ్డారు. భారత్‌తో బంధం బలోపేతం చేసుకొంటామన్నారు. 

Updated : 10 Sep 2023 16:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీ20 సదస్సులో న్యూదిల్లీ డిక్లరేషన్‌ ద్వారా రష్యాను ఒంటరి చేయడాన్ని ధ్రువీకరించారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సదస్సు ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పు పట్టారు. జీ20 నాయకులు సమష్టిగా డిక్లరేషన్‌ను అంగీకరించిన మర్నాడే మెక్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘శాంతి, ఐకమత్యం కోసం ప్రధాని మోదీ మాటలకు ధన్యవాదాలు. రష్యా ఇప్పటికీ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది.. జీ20 మొత్తం ఉక్రెయిన్‌లో శాంతికి కట్టుబడి ఉంది. ఐరాస ఛార్టర్‌కు అనుగుణంగా నేను ఈ మాటలు నొక్కి చెబుతున్నాను’’ అని మెక్రాన్‌ రిపోర్టర్లకు వెల్లడించారు. జీ20 డిక్లరేషన్‌ రష్యాకు దౌత్య విజయం ఏమాత్రం కాదని ఆయన ఘాటుగా పేర్కొన్నారు. జీ20 సదస్సులో పర్యావరణ అంశంపై వచ్చిన ఫలితాలు సరిపోవని.. మరింత సాధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. పర్యావరణ మార్పులపై స్పందించాల్సిన బాధ్యత సంపన్న దేశాలదే అన్నట్లు చూస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల దృక్కోణం కూడా సరికాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధితో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం సమష్టిగా ఎదుర్కోవాల్సిన సమస్య అని పేర్కొన్నారు. 

అసలు జీ20 ఉక్రెయిన్‌పై దౌత్యపరమైన పురోగతి సాధించడానికి వేదిక కాదని మెక్రాన్‌ వెల్లడించారు. భారత్‌, ఫ్రాన్స్‌ రక్షణ బంధం బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ బాస్టిల్‌ డే పరేడ్‌కు హాజరుకావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావించారన్నారు. 

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌తో ద్వైపాక్షి చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడించారు. భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు జరిగాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని