శకటాల వివాదం.. రక్షణశాఖ ఏం చెబుతోంది

ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో కొన్ని రాష్ట్రాల శకటాలకు చోటు దక్కకపోవడం వివాదానికి దారితీసింది. ఉద్దేశపూర్వకంగానే భాజపాయేతర రాష్ట్రాల శకటాలను ప్రభుత్వం తిరస్కరించిందని ఆయా రాష్ట్రాలు

Updated : 03 Jan 2020 11:30 IST

దిల్లీ: ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో కొన్ని రాష్ట్రాల శకటాలకు చోటు దక్కకపోవడం వివాదానికి దారితీసింది. ఉద్దేశపూర్వకంగానే భాజపాయేతర రాష్ట్రాల శకటాలను ప్రభుత్వం తిరస్కరించిందని ఆయా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. అయితే సమయాభావం కారణంగా అన్ని రాష్ట్రాలకు అవకాశం ఇవ్వలేకపోతున్నామని, నిపుణుల కమిటీ ఎంపిక చేసి వాటికే అనుమతినిచ్చినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. 

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రదర్శించే శకటాల వివరాలపై రక్షణ శాఖ జనవరి 1 రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదిత శకటాలపై నిపుణుల కమిటీ పలుమార్లు సమావేశమై పరిశీలనలు జరిపిందని ఆ ప్రకటనలో పేర్కొంది. సమయాభావం కారణంగా అత్యుత్తమంగా ఉన్న కొన్ని శకటాలను మాత్రమే ఎంపిక చేసినట్లు వెల్లడించింది. 2020 గణతంత్ర వేడుకల పరేడ్‌కు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 32, మంత్రిత్వ శాఖల నుంచి 24 ప్రతిపాదనలు రాగా.. వీటిల్లో నుంచి 22 శకటాలను ప్రదర్శనకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇందులో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ఉన్నాయి. 

ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌ శకటాన్ని తిరస్కరించడంపై కూడా రక్షణశాఖ స్పందించింది. బెంగాల్‌ శకటంపై నిపుణుల కమిటీ రెండు సమావేశాల్లో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శకటాల ఎంపికలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఈ ప్రకటనతో కేంద్రం పరోక్షంగా పేర్కొంది. పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, కేరళ శకటాలకు పరేడ్‌లో చోటు ఇవ్వకపోవడంపై ఆయా రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ భాజపా ప్రభుత్వం లేనందునే ఆ శకటాలను ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించాయి. అయితే హరియాణా, ఉత్తరాఖండ్‌, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్‌ లాంటి భాజపా పాలిత రాష్ట్రాలకు చెందిన శకటాలు కూడా తిరస్కరణకు గురవడం గమనించదగ్గ విషయం. 

పరేడ్‌లో అలరించే శకటాలివే..

* ఆంధ్రప్రదేశ్‌, అసోం, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల శకటాలు

* తాగునీరు, పారిశుద్ధ్య విభాగానికి చెందిన శకటం

* ఆర్థిక సేవల విభాగానికి చెందిన శకటం

* ఎన్డీఆర్‌ఎఫ్‌, హోంశాఖ శకటం

* పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగ శకటం

* సీపీడబ్ల్యూడీ, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ శకటం

* షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ శకటం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని