కరోనా ఆ దాడుల కంటే ప్రమాదకరం: ట్రంప్‌

అమెరికాపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్ నాటి ఆ రెండు దాడుల కంటే కూడా ప్రమాదకరమని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

Published : 07 May 2020 12:05 IST

వాషింగ్టన్‌: దేశంపై జరిగిన అన్ని దాడుల కంటే భయంకరమైన దాడిని ఇప్పుడు కొవిడ్-19 రూపంలో ఎదుర్కొంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికాపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్ నాటి పెరల్‌‌ హార్బర్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ దాడుల కంటే కూడా ప్రమాదకరమని ట్రంప్ చెప్పారు. అసలు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరారు. కొవిడ్‌ను దాని మూలకేంద్రం అయిన చైనా వద్దే ఆపి ఉండాల్సిందని, అ విధంగా చేయలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి యుద్ధానికి దారితీసే అవకాశముందా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు... అసలు కరోనా వైరస్‌ను ఎదుర్కోవటమే కనపడని శత్రువుతో యుద్ధం మాదిరిగా ఉందని ట్రంప్‌ జవాబిచ్చారు. కరోనా మహమ్మారి చైనా కంటే అమెరికాకే పెద్ద శత్రువని ఆయన వెల్లడించారు.

1941లో హవాయిలో ఉన్న అమెరికా నావికా కేంద్రం పెరల్‌ హార్బర్‌పై జపాన్ ఆకస్మికంగా దాడి చేసింది. కాగా, ఈ సంఘటన రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఇక సెప్టెంబర్‌ 11, 2001లో న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన ట్విన్‌ టవర్స్‌పై తీవ్రవాదులు దాడి చేశారు. హైజాక్‌ చేసిన విమానాలతో ఆ భవనాలను ఢీకొన్న సంఘటనలో 3000 మందికి పైగా మరణించారు. ఈ ఘటనతో తీవ్రవాద నిర్మూలనకు కంకణం కట్టుకున్న అమెరికా... ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ తదితర దేశాల్లో రెండు దశాబ్దాల పాటు ఏరివేత కార్యక్రమాలను నిర్వహించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని