‘కాంగ్రెస్‌ సీఎంలు మీ మాట వినరా?’

లాక్‌డౌన్‌ అమలులో కేంద్ర ప్రభుత్వ విఫలమైందన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యల్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తీవ్రంగా ఖండించారు. లాక్‌డౌన్ ఫలితాలివ్వనట్లయితే.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆంక్షల్ని మే 31 వరకు ఎందుకు పొడిగించారని ప్రశ్నించారు........

Updated : 27 May 2020 17:00 IST

రాహుల్‌ లాక్‌డౌన్‌ విమర్శలపై కేంద్రమంత్రి సూటి ప్రశ్న

దిల్లీ: లాక్‌డౌన్‌ అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యల్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తీవ్రంగా ఖండించారు. లాక్‌డౌన్ ఫలితాలివ్వనట్లయితే.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆంక్షల్ని మే 31 వరకు ఎందుకు పొడిగించారని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు మీ మాటల్ని వినరా’ అని రాహుల్‌ని ఎద్దేవా చేశారు. అలాగే లాక్‌డౌన్‌ నుంచి ఎలా బయటపడాలో కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని కోరారు. అంతకంటే ముందు ఈ విషయంలో కాంగ్రెస్‌ సీఎంలకు మార్గనిర్దేశం చేయాలని హితవు పలికారు. అసంబద్ధ, అవాస్తవ ప్రచారాలతో కొవిడ్-19పై భారత్‌ చేస్తున్న పోరును రాహుల్‌ బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రపంచంలో 15 దేశాల్లో వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని.. వీటి జనాభా 142 కోట్లని రవిశంకర్‌ ప్రసాద్‌ గుర్తుచేశారు. మే 26 నాటికి ఈ దేశాల్లో 3.43 లక్షల మంది మరణించారన్నారు. కానీ, 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో 4,345 మంది మాత్రమే మరణించారన్నారు. కేవలం లాక్‌డౌన్‌ వల్లే మరణాల సంఖ్యను తగ్గించగలిగామన్నారు.

లాక్‌డౌన్‌తో వైరస్‌ను కట్టడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం విఫలమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. నాలుగు దశల లాక్‌డౌన్‌ ఎలాంటి ఫలితాలివ్వలేదన్నారు. కొవిడ్‌ కేసులు ఎక్కవవుతున్న తరుణంలో ప్రపంచంలో ఆంక్షల్ని ఎత్తివేస్తున్న ఏకైక దేశం భారత్‌ అని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని