ఈ పార్టీలు ప్రాణాంతకం

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యనే కాదు.. మృతుల సంఖ్యను భారీగా పెంచుతోంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావడానికే అందరూ భయపడుతుంటే.. అలబామాకు చెందిన కొందరు విద్యార్థులు ఏకంగా పార్టీలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో గుమిగూడి కరోనాతో

Published : 04 Jul 2020 13:10 IST

అలబామాలో కొవిడ్‌-19 పార్టీలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు యూఎస్‌లో 27లక్షలకుపైగా ప్రజలు కరోనా బారిన పడగా.. 1.30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడ తమకు కరోనా సోకుతుందోనని జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతుంటే.. అమెరికాలోనే కొందరు విద్యార్థులు ఏకంగా కరోనాతో చెలగాటమాడుతున్నారు. పార్టీలు నిర్వహిస్తూ.. వైరస్‌ మహమ్మారి ముందు కుప్పి గంతులు వేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని అలబామాలో కొందరు విద్యార్థులు ‘కొవిడ్‌-19’ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి విద్యార్థులతో పాటు కరోనా సోకిన వారిని ఆహ్వానిస్తున్నారు. అందరూ ఓ కుండలో డబ్బులు వేసి.. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో కరోనా ఉన్న వారి నుంచి ఎవరికి మొదట కరోనా సోకుతుందో వారికి ఆ కుండలోని డబ్బంతా చెందుతుందని నిబంధన పెట్టుకొని మరీ పార్టీలు జరుపుకొంటున్నారట. ఈ విషయాన్ని టుస్కాలుసా నగర కౌన్సిలర్‌ సోన్యా మెక్‌కిన్‌స్ట్రీ వెల్లడించారు. ‘‘ఇలా పార్టీలు నిర్వహించే వారికి బుద్ధిలేదు. కావాలనే వారు కరోనాను వ్యాప్తి చెందేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల మనం కరోనాతో ఎలా పోరాడగలం’’అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ పార్టీల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం భయాందోళనకు గురిచేస్తోందని సోన్యా అన్నారు. ఎవరైనా వారి నిబంధనలు తెలియక పార్టీకి వెళ్తే వారికి కరోనా సోకొచ్చని చెప్పారు. విద్యార్థులకు కరోనా ఉంటే వారి కుటుంబసభ్యులు ప్రమాదంలో పడినట్లేనని చెప్పారు. గత కొన్ని వారాలుగా ఈ పార్టీలు జరుగుతున్నట్లు తెలిసిందని, ప్రస్తుతం ఇలా ‘కొవిడ్‌-19’ పార్టీలు నిర్వహిస్తున్న వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సోన్యా తెలిపారు. ‘కొవిడ్‌-19’ పార్టీలు జరుగుతున్నాయన్న విషయాన్ని నగర ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఉన్నతాధికారి రాండీ స్మిత్‌ కూడా అంగీకరించారు. మొదట తాము ఈ విషయాన్ని నమ్మలేదని, ఈ పార్టీలపై నిఘా పెట్టి, పరిశోధన చేసి నిజమేనని నిర్థారించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అలబామాలో 40వేల కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. దాదాపు వెయ్యి మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని