కేరళలో ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ కలవరం

కేరళకు మరో వైరల్‌ ఫీవర్‌ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Published : 08 May 2024 05:53 IST

మూడు జిల్లాల్లో వెలుగులోకి
అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం

తిరువనంతపురం: కేరళకు మరో వైరల్‌ ఫీవర్‌ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్రిశూర్‌, మళప్పురం, కోజికోడ్‌ జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర  ఆరోగ్యశాఖ ఆదేశించింది. వెస్ట్‌ నైల్‌ అనేది వైరల్‌ జ్వరం. ఇన్‌ఫెక్షన్‌ సోకిన క్యూలెక్స్‌ దోమ ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. దీనికి ఎటువంటి ఔషధాలు, వ్యాక్సిన్‌ లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం, వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1937లో తొలిసారిగా దీన్ని ఉగాండాలో గుర్తించారు. మనదేశంలో మొదటిసారిగా కేరళలో 2011లో ఆరేళ్ల బాలుడిలో వెలుగు చూసింది. అయితే, ఆ అబ్బాయి 2019లో జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

లక్షణాలు: వెస్ట్‌నైల్‌ ఫీవర్‌ బాధితుల్లో తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ, ఎక్కువమంది బాధితుల్లో ఇవి కనిపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం జ్వరం, తలనొప్పి, వాంతులు, దురద వంటి లక్షణాలుంటాయి. కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రం మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా అపస్మారక స్థితిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ వ్యాధితో పోలిస్తే లక్షణాలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువే.ఈ ఫీవర్‌ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. జ్వరం లేదా వెస్ట్‌ నైల్‌ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి లక్షణాలు కనిపిస్తే మాత్రం తక్షణమే చికిత్స తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఈ వైరస్‌ బారినపడిన వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు