మతమార్పిడి నిరోధక చట్టాలపై కేసుల స్థితిని తెలపండి

వివాహాలను అడ్డుపెట్టుకుని జరుగుతున్న మత మార్పిళ్లను నిరోధించడానికి వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలను సవాల్‌ చేస్తూ హైకోర్టుల్లో దాఖలైన కేసుల స్థితిని తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Published : 03 Jan 2023 04:47 IST

రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం

దిల్లీ: వివాహాలను అడ్డుపెట్టుకుని జరుగుతున్న మత మార్పిళ్లను నిరోధించడానికి వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలను సవాల్‌ చేస్తూ హైకోర్టుల్లో దాఖలైన కేసుల స్థితిని తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు స్వచ్ఛంద సంస్థ.. ‘సిటిజెన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌’కు ఈ మేరకు సూచనలు చేసింది. ‘రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టం, ఆర్డినెన్స్‌ లేదా చట్ట సవరణలకు వ్యతిరేకంగా హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సారాంశాన్ని తెలియజేస్తూ ఒక నోట్‌ అందజేయండి. అవన్నీ స్వభావ రీత్యా ఒకే తరహా కేసులైతే సుప్రీంకోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలిస్తాం. ఒకవేళ హైకోర్టుల్లో విచారణ కీలక దశలో ఉంటే అక్కడే కొనసాగించాలని చెబుతామ’ని ధర్మాసనం పేర్కొంది. నోట్‌ దాఖలుకు రెండు వారాల గడువునిచ్చింది. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మత స్వేచ్ఛ చట్టం-2003’లోని సెక్షన్‌ 5 అమలు నిలిపివేతకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ కూడా కేసు దాఖలైంది. ఆ వివరాలనూ తమకు అందజేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం కోరింది. ఆ చట్టంలోని సెక్షన్‌ 5 ప్రకారం... వివాహితులు మతం మారాలని భావిస్తే జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతిని పొందాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాలు తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు స్వభావ రీత్యా ఒకే రకమైనవని, ఆయా హైకోర్టుల్లో దాఖలైన కేసులన్నిటినీ సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీచేయడం సముచితమని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ తెలిపారు. హైకోర్టుల్లో కేసుల విచారణలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ వెల్లడించారు.

విదేశాలకెళ్లే భారతీయులకు ప్రామాణిక నిబంధనలు రూపొందించాలన్న పిటిషన్‌ తిరస్కరణ

ఇతర దేశాలకు వెళ్లే భారతీయుల భద్రత కోసం ప్రామాణిక నిబంధనలు రూపొందించి జారీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. యూఏఈలో అక్రమ నిర్బంధానికి గురై నాలుగు రోజుల తర్వాత విడుదలైన నొయిడా వ్యాపారి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అతని ముఖం ఆకృతి.. పరారీలో ఉన్న నేరస్థుడి ముఖ పోలికలకు సామీప్యం ఉన్నట్లు ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ గుర్తించడంతో ఆ వ్యాపారికి కష్టాలు ఎదురయ్యాయి. విదేశాల్లో అక్రమ నిర్బంధానికి గురైతే ఆ అంశాన్ని పరిశీలించి పరిష్కరించడానికి దౌత్య కార్యాలయాలు ఉన్నాయని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని