Vande Bharat Express: వందేభారత్‌ మరో 3 చోట్ల తయారీ

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఉత్పత్తిని దేశంలో నాలుగు కర్మాగారాలకు విస్తరించబోతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. బుధవారం కేంద్ర బడ్జెట్‌ అనంతరం ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

Updated : 02 Feb 2023 13:28 IST

వారానికి 2-3 చొప్పున అందుబాటులోకి  
ప్రతి పెద్ద పట్టణానికీ నడుపుతాం  
ఈ ఏడాది చివరికి హైడ్రోజన్‌ రైలు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఈనాడు, దిల్లీ: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఉత్పత్తిని దేశంలో నాలుగు కర్మాగారాలకు విస్తరించబోతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. బుధవారం కేంద్ర బడ్జెట్‌ అనంతరం ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచబోతున్నాం. ఇప్పటివరకు ఇవి చెన్నైలోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో మాత్రమే తయారయ్యేవి. ఇకపై హరియాణాలోని సోనీపత్‌, మహారాష్ట్రలోని లాతూర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కర్మాగారాల్లోనూ ఉత్పత్తి చేస్తాం. దీనివల్ల దేశం నలుమూలలనూ వందేభారత్‌తో అనుసంధానించడం సాధ్యమవుతుంది. ఇప్పటివరకు 8 వందేభారత్‌ రైళ్లు 52 సార్లు భూమిని చుట్టివచ్చినంత దూరం పయనించాయి. వీటిలో ఎలాంటి సమస్యలూ లేవని రూఢీ అయింది. ఉత్పత్తి సామర్థ్య విస్తరణ వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి ప్రతి వారం 2-3 రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి పెద్ద పట్టణాన్నీ వందేభారత్‌తో అనుసంధించాలన్నది ప్రధానమంత్రి లక్ష్యం’’ అని తెలిపారు.

హైడ్రోజన్‌ రైలు తయారయ్యేది మన దేశంలోనే

తొలి హైడ్రోజన్‌ రైలు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని, ఇది దేశీయంగానే తయారవుతుందని వైష్ణవ్‌ వెల్లడించారు. ‘హైడ్రోజన్‌ రైలు పూర్తిగా భారత్‌లో రూపుదిద్దుకుంటుంది. దీన్ని  హెరిటేజ్‌ సర్క్యూట్‌లో నడుపుతాం. తర్వాత అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాం. రైల్వేలో హరిత ఇంధన వినియోగాన్ని పెంచడానికి అల్ట్రా మెగా సోలార్‌ ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తాం. 85% రైలు మార్గాల  విద్యుదీకరణ పూర్తయింది’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని