ఆ క్షమాపణలను అంగీకరించం

ఒడిశాలో గత ఏడాది కోర్టులను బహిష్కరించడంతో పాటు హింసాత్మక ఘటనలకు పాల్పడిన న్యాయవాదుల క్షమాపణలను అప్పుడే అంగీకరించబోమని సుప్రీంకోర్టు తెలిపింది.

Published : 07 Feb 2023 04:12 IST

ఆ న్యాయవాదులు వారి తప్పులు తెలుసుకోవాల్సిందే
ఒడిశాలో కోర్టుల బహిష్కరణపై సుప్రీం ఆగ్రహం

దిల్లీ: ఒడిశాలో గత ఏడాది కోర్టులను బహిష్కరించడంతో పాటు హింసాత్మక ఘటనలకు పాల్పడిన న్యాయవాదుల క్షమాపణలను అప్పుడే అంగీకరించబోమని సుప్రీంకోర్టు తెలిపింది. ఎలా ప్రవర్తించాలో ఆ న్యాయవాదులు నేర్చుకోవాల్సిందేనని అభిప్రాయపడింది. ఒడిశా హైకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటుచేసే విషయమై ఆందోళనకు దిగిన న్యాయవాదులు స్థానిక కోర్టుల్లో విధులను బహిష్కరించారు. హింసాయుత ఘటనలకు పాల్పడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు... ధిక్కరణ నోటీసులు జారీ చేయడంతో కొందరు న్యాయవాదులు క్షమాపణలు తెలిపారు. అయితే, వీటిని ప్రస్తుత దశలో ఆమోదించలేమని సోమవారం కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో అరెస్టైన న్యాయవాదులకు బెయిళ్లు కూడా లభించడంలేదని, గత 50 రోజులుగా జైళ్లలోనే ఉన్నారని ఒడిశా బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్ర వెల్లడించారు. అయినప్పటికీ న్యాయవాదులపై దాఖలైన ధిక్కరణ కేసులను వెనక్కి తీసుకునేదిలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం విస్పష్టం చేసింది. బెయిల్‌ కోసం సంబంధిత దిగువ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. తాము బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారని మండిపడింది. కేసుల నుంచి తప్పించుకోవడానికి క్షమాపణలు చెప్పడం కాకుండా నిందితుల్లో నిజంగానే పరివర్తన రావాలని పేర్కొంది. ఒడిశాలోని దిగువ కోర్టుల విధులకు పదే పదే కలిగించిన ఆటంకాలను ప్రస్తావించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కు వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని